నరమేధం ఆగేదెన్నడు?

నరమేధం ఆగేదెన్నడు?

పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్​లోని  భారత స్విట్జర్లాండ్​గా పిలిచే పహల్గాం ప్రాంతం  బైసారన్ లోయలో ఏప్రిల్ 22న  నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. టూరిస్టులపై  కాల్పులు జరిపి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది. 

ఈ దాడిని  ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ తాము చేసినట్లు ప్రకటించింది. వీరిలో ఇద్దరు పాక్​​కు చెందిన వారు కాగా మరో ఇద్దరు స్థానికులుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.  2008లో  ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే.  జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్తానీ  తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన చెపుతున్నది.

కాశ్మీర్​లో మతపరమైన ఉగ్రవాదం నెలకొంది.  టీఆర్​ఎఫ్​ ఉగ్రసంస్థ  మతపరమైన లక్ష్యాలను సాధించడానికి లేదా ఒక నిర్దిష్ట మత సమూహానికి వ్యతిరేకంగా దాడులు నిర్వహిస్తోంది.  ప్రస్తుతం జరిగిన  సంఘటన ఈ రకమైనదే.    తహావూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్​కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం  కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ముందుగానే తెలిపింది.  అయితే,  కేంద్రం, జమ్మూ కాశ్మీర్​ ప్రభుత్వం సున్నిత పర్యాటక ప్రాంతమైన జమ్మూలో ముందుగానే కేంద్ర, రాష్త్ర బలగాలను అప్రమత్తం చేయడంలో కొంత విఫలమైనట్టు జరిగిన నరమేధమే చెపుతోంది. 

ఉగ్రవాదం మూడు రకాలు

ఉగ్రవాదాన్ని మూడు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి మతపరమైన ఉగ్రవాదం. దీనినే ఇస్లామిక్ విభజన ఉగ్రవాదం అనవచ్చు.  రెండోది  జాతీయవాద ఉగ్రవాదం. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది.  మూడోది  వామపక్ష ఉగ్రవాదం అనగా నక్సలిజం. అయితే,  ప్రపంచంలో  ఇస్లామిక్ ఉగ్రవాదం  భయంకరమైనదిగా  గుర్తింపుపొందింది.  

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్,  ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి.  జమ్మూ కాశ్మీర్లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ టెర్రిరిస్ట్​ గ్రూపులు అయిన  లష్కర్ -ఏ -తోయిబా, జైష్ -ఏ - మహమ్మద్,  హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి.  2008 ముంబై దాడిని 26/11 సంఘటనగా పేర్కొంటారు. ఈ  టెర్రర్​ అటాక్​ చేసి  పాకిస్తాన్​కు చెందిన  లష్కర్​ ఏ తోయిబా (LeT)  166 మందిని పొట్టన పెట్టుకుంది.  మొన్న మంగళవారం 22/4న జరిగిందీ పక్కా మతపరమైన ఉగ్రవాద సంఘటనే.  

ఆర్టికల్ 370 రద్దు

జమ్మూ కాశ్మీర్​కు  సంబంధించి 2019 ఆగస్టు 5న  ఆర్టికల్ 370ను  రద్దుచేసి  శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం తీవ్రవాద సంస్థలకు నచ్చలేదు.  ఒకటి జమ్మూకాశ్మీర్,  రెండోది లడఖ్  కేంద్ర పాలిత ప్రాంతాలు చేశారు. 2024 సెప్టెంబర్​లో  జమ్మూ కాశ్మీర్​లో  జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మొత్తం 90 స్థానాలలో 42 సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కొంత సామరస్యత కనిపించినట్లనిపించింది. ఇపుడు అదేమీ కాదని పహల్గాం​ సంఘటన చెపుతోంది. 

2024లో జమ్మూ కాశ్మీర్​లో  61 ఉగ్రవాద సంఘటనలు జరగగా 127 మంది చనిపోయారు. 2025లో ఇంతవరకు జరిగిన 11 సంఘటనలలో  42 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్  పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా  ఇప్పటికీ కొనసాగుతోంది.  ఏదిఏమైనా, జమ్మూ కాశ్మీర్​ రాష్ట్ర ప్రభుత్వానికి  ఉగ్రవాదాన్ని తొలగించే శక్తి  లేకుండటం వల్ల కేంద్ర మిలిటరీ వ్యవస్థ జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. 

14వ స్థానంలో భారత్

ప్రపంచంలోని అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశాలలో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) 2025 ప్రకారం భారతదేశం 14వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం రెండో స్థానంలో నిలిచి అత్యంత ప్రమాదకరమైన దేశంగా పేర్కొనడం జరిగింది.  సౌత్  ఆసియన్ టెర్రరిజం నివేదికల ప్రకారంగా 2025లో  టెర్రరిస్ట్ చర్యల్లో మొత్తం 61 ఉగ్రవాద సంఘటనల్లో 242 మంది చనిపోయారు.  

 2024లో  మొత్తం 278 సంఘటనలు జరగగా 626మంది చనిపోయారు. గత 25 సంవత్సరాల కాలంలో మొత్తం 24,369  సంఘటనలలో 47,762 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకొన్నారు. మృతుల్లో 14,489 పౌరులు ఉన్నారు. అయితే,  ప్రస్తుతం ఈ టెర్రరిస్టులు కేవలం సామాన్య పౌరులనే  లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం గమనార్హం.   

22/4 న జమ్మూలోని పహల్గాం​లో జరిగిన  పర్యాటకుల ఊచకోత దీనికి ఉదాహరణ.  అలాగే 2002లో గుజరాత్​లోని అక్షరధామం ఆలయం,  జమ్మూలోని రఘునాథ ఆలయాలపై దాడి, 2024లో  వైష్ణవి​ దేవి యాత్రికులపై దాడులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, ఈ టెర్రరిస్టుల  దాడులను తీవ్రంగా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ  దాడిలో  ప్రత్యేకంగా  ఒకవర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం అందరూ ఆలోచించాల్సిన విషయం. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన  వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని  విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి.  

కొద్దిరోజుల్లో భారత సైన్యం పీఓకేలోని తీవ్రవాద మూకల స్థావరాలపై సర్జికల్​ స్ట్రైక్ మరోసారి​ జరిపే అవకాశాలు ఉన్నాయి. తీవ్రవాదానికి అదో గట్టి గుణపాఠం చెప్పగలిగేలా ఉండాలి.గత మూడేళ్లుగా కాశ్మీర్​లో పర్యాటక రంగం పుంజుకుంది.  కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఈ తీవ్రవాదులు చేసిన మతాధార మారణకాండ..పుంజుకుంటున్న కాశ్మీర్​ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే  కాశ్మీర్ ​పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది.

- డా. సుధాకర్ ​అడికి,​అసోసియేట్​ప్రొఫెసర్​ (రి)-