రెండేళ్ల కిందట టీ20 విమెన్స్ వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి..! గతేడాది కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో కంగారూల చేతిలో పరాజయం..! ఈ రెండింటికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమిండియా విమెన్స్ టీమ్‌కు వచ్చింది..! గురువారం జరిగే వరల్డ్‌కప్ సెమీస్ ఫైట్‌లో ఆసీస్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను సాధించాలని హర్మన్‌సేన టార్గెట్‌గా పెట్టుకుంది..! మరి కంగారూలపై ఈసారి ఇండియా పైచేయి సాధిస్తుందా? లేదా?
కేప్ టౌన్: గతంతో పోలిస్తే ఇండియా ఆట మెరుగైనా.. టీ20 వరల్డ్‌కప్ రికార్డు మాత్రం బాగాలేదు. బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో ఓ కారణంతో కప్ లేకుండా వెనక్కి వస్తున్న టీమిండియా.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే సెమీస్ ఫైట్‌లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో కంగారూలు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు. దీంతో చావోరేవోలాంటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌సేన భావిస్తోంది.
‘టాప్’ గాడిలో పడితేనే..
ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవాలంటే టాప్ ఆర్డర్ గాడిలో పడాలి. దీనికితోడు బౌలింగ్ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. ఇక హిట్టర్లందరూ భారీ సిక్సర్లు కొట్టాలి. ఓపెనింగ్‌లో షెఫాలీతో పాటు స్మృతి మంధానా బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్లు ఇచ్చే ఓపెనింగ్‌పైనే ఇండియా విజయం ఆధారపడి ఉంది. అయితే షెఫాలీ.. షార్ట్ బాల్స్ ఆడలేకపోవడంతో పాటు స్ట్రయిక్‌ను రొటేట్ చేయలేకపోతున్నది. ఈ రెండు అంశాలపై ఆమె దృష్టి సారించాల్సి ఉంది. కెప్టెన్ హర్మన్ సరైన ఫామ్‌లో లేదు. ఈ వరల్డ్‌కప్‌లో తన మార్క్ ఆటను ఇంకా చూపెట్టలేదు. ఇప్పుడు కంగారూలపై భారీ స్కోరు చేయకపోతే ఇండియా ఓటమికి ప్రధాన కారణం అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడినా.. ఆమె కెప్టెన్సీపై కూడా ప్రభావం పడే అవకాశం ఎక్కువగానే ఉంది. మిడిలార్డర్‌లో జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్ భారీ స్కోరుపై కన్నేశారు. బౌలింగ్‌లోనూ ఇండియా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పేసర్లు రాజేశ్వరి, రేణుకా సింగ్‌పై ఎక్కువ ఆశలు ఉన్నాయి. అయితే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన దేవికా వైద్య ప్లేస్‌లో స్పిన్నర్ రాధా యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. శిఖా పాండే, పూజ మెరిస్తే ఇండియా కష్టాలు తీరినట్లే. అయితే కంగారూలను అడ్డుకోవాలంటే ఇండియా ఫీల్డింగ్‌లోనూ మెరవాల్సి ఉంటుంది.
మూనీ వచ్చేసింది..
ఈ మ్యాచ్ కోసం ఫైనల్ ఎలెవన్‌లో ఆసీస్ ఒక్క మార్పు చేయనుంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న బెత్ మూనీ తుది జట్టులోకి రానుంది. ఇక వరుసగా 22వ విజయంతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని కంగారూలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌కు తిరుగులేదు. లీగ్ దశలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు ఉదాహరణ. టాప్ ఆర్డర్‌లో హీలీ, మూనీ, పెర్రీ, గార్డెనర్ చెలరేగితే ఇండియా బౌలర్లకు కష్టాలు తప్పవు. మిడిలార్డర్‌లో కెప్టెన్ లానింగ్, మెక్‌గ్రాత్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో హారిస్, కింగ్, షుట్, బ్రౌన్‌పై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఇక ఫీల్డింగ్‌లోనూ ఆసీస్‌కు తిరుగులేదు.