- సెంచరీలతో చెలరేగిన శ్రేయస్, గిల్
- రెండో వన్డేలో ఇండియా గ్రాండ్ విక్టరీ
- 99 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు
ఇండోర్: వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. తన ఫిట్నెస్, ఫామ్‌పై సందేహాలకు చెక్ పెడుతూ శ్రేయస్ అయ్యర్ (90 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105)తో పాటు శుభ్‌మన్ గిల్ (97 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104) సెంచరీతో దంచికొట్టిన వేళ.. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 99 రన్స్ తేడాతో (డక్‌వర్త్ లూయిస్)ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 399/5 స్కోరు చేసింది. వన్డేల్లో కంగారూలపై ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. సూర్యకుమార్ (37 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్), రాహుల్ (38 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హోరెత్తించారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆసీస్ టార్గెట్‌ను 33 ఓవర్లలో 317 రన్స్‌గా రివైజ్ చేశారు. ఛేజింగ్‌లో ఆసీస్ 28.2 ఓవర్లలో 217 రన్స్‌కు ఆలౌటైంది. సీన్ అబాట్ (54), వార్నర్ (53) టాప్ స్కోరర్లు. అశ్విన్ (3/41), జడేజా (3/42) టర్నింగ్ దెబ్బకు కంగారూల బ్యాటింగ్ కుప్పకూలింది. స్టాండిన్ కెప్టెన్ స్మిత్ (0), మాథ్యూ షార్ట్ (9), ఇంగ్లిస్ (6), క్యారీ (14), గ్రీన్ (19) ఫెయిలవగా.. లబుషేన్ (27), హేజిల్‌వుడ్ (23) కాసేపు పోరాడారు. శ్రేయస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లో బుధవారం జరుగుతుంది.
దంచుడే.. దంచుడు
తొలుత ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే రుతురాజ్(8) వికెట్ కోల్పోయిన ఇండియాకు గిల్, శ్రేయస్ భారీ స్కోరు అందించారు. వరల్డ్ కప్‌కు ముందు వరుస వైఫల్యాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న శ్రేయస్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. తొలి 19 బాల్స్‌లో 9 రన్సే చేసిన గిల్ ఆ తర్వాత ఆసీస్ బౌలింగ్‌ను ఉతికేశాడు. అబాట్ (1/91) వేసిన 9వ ఓవర్‌లో స్ట్రయిట్‌గా తొలి సిక్స్ బాదాడు. గ్రీన్ (2/103) షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్‌లో మరో సిక్సర్‌గా మలిచాడు. ఈ టైమ్‌లో వాన వల్ల 40 నిమిషాలు ఆట ఆగింది. తిరిగి ప్రారంభమైన తర్వాత శ్రేయస్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో బౌండ్రీల వర్షం కురిపించాడు. హేజిల్‌వుడ్ (1/62), స్పెన్సర్ జాన్సన్ (0/61)తో పాటు స్పిన్నర్ జంపా (1/67) కూడా ప్రభావం చూపలేదు. ఇదే జోరుతో అయ్యర్ 86 బాల్స్‌లోనే వంద పూర్తి చేయగా, మరో 19 బాల్స్ తర్వాత గిల్ (92 బాల్స్) ఈ మార్క్‌ను అందుకున్నాడు. రెండో వికెట్‌కు 200 రన్స్ (164 బాల్స్‌లో) జోడించి 31వ ఓవర్‌లో శ్రేయస్ వెనుదిరిగాడు. మరో 4 ఓవర్ల తర్వాత గిల్ కూడా ఔటయ్యాడు. రాహుల్‌తో కలిసిన ఇషాన్ (31) నాలుగో వికెట్‌కు 59 రన్స్ జత చేసి ఔట్‌కాగా, 41వ ఓవర్‌లో వచ్చిన సూర్య ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. తన 360 యాంగిల్ టీ20 హిట్టింగ్‌ను వన్డేలకూ పరిచయం చేశాడు. గ్రీన్ వేసిన 44వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. 24 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసి రాహుల్‌తో ఐదో వికెట్‌కు 53, జడేజా (13 నాటౌట్)తో 44 రన్స్ జోడించాడు. అతని జోరుకు చివరి 10 ఓవర్లలో 103 రన్స్ రావడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
144 వన్డేలో ఇండియా నుంచి ఒకే జట్టు (ఆసీస్)పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డుకెక్కాడు. ఆసీస్‌పైనే 142 వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 399/5 (శ్రేయస్ 105, గిల్ 104, గ్రీన్ 2/103). ఆస్ట్రేలియా (టార్గెట్ 317): 28.2 ఓవర్లలో 217 ఆలౌట్ (అబాట్ 54, వార్నర్ 53, అశ్విన్ 3/41, జడేజా 3/42).