టీ20 సిరీస్‌పై ఇండియా కన్ను.. ఆసీస్‌తో నేడు రెండో వన్డే

టార్గెట్‌ సిరీస్‌

నేడు ఆసీస్‌తో ఇండియా సెకండ్ టీ20

జడేజా దూరమైనా బలంగానే కోహ్లీసేన
మ. 1.40 నుంచి సోనీ సిక్స్​లో

సిడ్నీలో వరుసగా రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా కాన్‌‌బెర్రాకు రాగానే కసిగా ఆడింది. చివరి వన్డేతో పాటు ఫస్ట్‌‌ టీ20లోనూ గెలిచి కంగారూలకు చెక్‌‌ పెట్టింది. ఇప్పుడు మళ్లీ సిడ్నీకి తిరిగొచ్చింది. క్రికెట్‌‌ వరల్డ్‌‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు వార్‌‌ను మరికొన్ని రోజుల్లోనే మొదలెట్టనున్న ఇండియా అంతకంటే ముందు టీ20 సిరీస్‌‌పై కన్నేసింది. ఈ షార్ట్‌‌ సిరీస్‌‌ నెగ్గి లాంగ్‌‌ ఫార్మాట్‌‌కు ముందు కాన్ఫిడెన్స్‌‌ పెంచుకోవాలని కోరుకుంటోంది.  కంకషన్‌‌కు గురైన జడేజా సేవలు కోల్పోయినా.. తొలి టీ20 గెలుపు ఊపును నేడు జరిగే రెండో మ్యాచ్‌‌లోనూ కొనసాగించి సిరీస్‌‌ పట్టేయాలని చూస్తోంది. అటువైపు ఆస్ట్రేలియాలను గాయాలు వెంటాడుతున్నాయి. హిప్‌‌ ఇంజ్యురీతో బాధపడుతున్న కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ ఆడడం అనుమానంగా మారింది. ఏకంగా ఆరుగురు టీ20 స్పెషలిస్టుల సేవలు కోల్పోయిన కంగారూ టీమ్‌‌ ఇండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరం.

సిడ్నీ: టీ20 సిరీస్‌‌ను కైవసం చేసుకొని వన్డే ఓటమికి రివెంజ్‌‌ తీర్చుకోవాలన్న టార్గెట్‌‌తో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. కాన్‌‌బెర్రాలో వరుసగా రెండు విక్టరీలతో లెక్క సరి చేసిన కోహ్లీసేన మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే టీ20 సిరీస్‌‌ను పట్టేయాలని చూస్తోంది.  టీమ్‌‌లో చాలా మంది ప్లేయర్లు వన్డే, టీ20లను సపరేట్‌‌ ఫార్మాట్స్‌‌లా కాకుండా ఆరు మ్యాచ్‌‌ల వైట్‌‌బాల్‌‌ లెగ్‌‌గా చూస్తున్నారు. కాన్‌‌బెర్రాలో రెండు వైట్‌‌ బాల్‌‌ గేమ్స్‌‌లో నెగ్గడంతో సిడ్నీలో చివరి రెండింటిలో  తమకు మెరుగైన ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇండియా ఫస్ట్‌‌ కంకషన్‌‌ సబ్‌‌స్టిట్యూట్‌‌గా వచ్చిన చహల్‌‌ స్పిన్‌‌ మ్యాజిక్‌‌తో తొలి టీ20లో నెగ్గిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌‌లో ఫేవరేట్‌‌గా బరిలోకి దిగుతోంది. ఆ పోరులో జడేజా పోరాటాన్ని తక్కువ చేయాడానికి లేదు. అతని మెరుపు ఇన్నింగ్స్‌‌ వల్లే ఇండియా మంచి స్కోరు చేసింది. అయితే, అన్ని సార్లూ  లోయర్‌‌ ఆర్డర్‌‌పైనే భారం ఉంచడం మంచిది కాదు. భారీ టార్గెట్‌‌ ఇవ్వాలన్నా… ఛేజ్‌‌ చేయాలన్న  టాప్‌‌–5 బ్యాట్స్‌‌మెన్‌‌ సత్తా చాటాల్సిందే. శుక్రవారం రాహుల్‌‌ తప్పితే టాప్‌‌–5లో ఎవ్వరూ రాణించలేకపోయారు.  ఫామ్‌‌లో ఉన్న  ధవన్‌‌, కోహ్లీతో పాటు టూర్‌‌లో ఫస్ట్‌‌ టైమ్‌‌ చాన్స్‌‌ దక్కించుకున్న పాండే  నిరాశ పరిచారు. శాంసన్‌‌ ఓ మోస్తరుగా ఆడాడు. కాబట్టి టాపార్డర్‌‌ కచ్చితంగా నిలబడాల్సిందే. ముఖ్యంగా తొలి వన్డేలో ఫిఫ్టీ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోతున్న ధవన్‌‌ శుభారంభం ఇవ్వాల్సి ఉంటుంది. కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌‌ ఆడితే సగం సమస్యలు తొలగిపోతాయి. మనీశ్‌‌ పాండేకు సెకండ్‌‌ చాన్స్‌‌ ఇస్తారా? లేక శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను తీసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. చివర్లో శాంసన్‌‌, హార్దిక్‌‌ పాండ్యా మెరుపులు మెరిపిస్తే తిరుగుండదు. అయితే, ముందుగా బ్యాటింగ్‌‌కు వస్తే శాంసన్‌‌ కాస్త నిదానంగా ఆడడం ముఖ్యం. ఇక, బౌలింగ్‌‌లో ఇండియాకు ఎలాంటి సమస్యల్లేవు. కొత్త పేసర్‌‌ నటరాజన్‌‌, స్పిన్నర్‌‌ సుందర్‌‌ అదరగొడుతున్నారు. జడ్డూ ప్లేస్‌‌లో చహల్‌‌ కొనసాగడం గ్యారంటీ. బుమ్రా, షమీలో ఒకరు దీపక్‌‌ చహర్‌‌తో కలిసి కొత్త బాల్‌‌ పంచుకుంటారు. మరోసారి సమష్టిగా ఆడితే సిరీస్‌‌ నెగ్గడం పెద్ద కష్టం కాబోదు.

కంగారూలకు సవాల్‌

సిడ్నీలో మంచి రికార్డున్నప్పటికీ లాస్ట్‌ వన్డే, ఫస్ట్ టీ20 ఓటమితో ఆస్ట్రేలియా డీలా పడింది. ఆ టీమ్‌ ఇంజ్యురీ ప్లేయర్ల లిస్ట్‌‌లో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ కూడా చేరాడు. గత మ్యాచ్‌లో హిప్‌ ఇంజ్యురీకి గురైన ఫించ్‌ ఫిట్‌ నెస్‌‌పై అనుమానాలున్నాయి. శనివారం నిర్వహించిన స్కానింగ్‌‌ రిపోర్ట్స్‌ వచ్చాకే అతనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఫామ్‌ లో ఉన్న అతను బరిలోకి దిగకుంటే ఆసీస్‌‌కు ఇబ్బంది కానుండగా ఇండియాకు ప్లస్‌‌ పాయింట్‌ అవుతుంది. ఒకవేళ ఫించ్‌ కోలుకోకపోతే మాథ్యూ వేడ్‌ టీమ్‌‌ను నడిపించే అవకాశం ఉంది. వార్నర్‌ సహా ఇప్పటికే ఆరుగురు ఫస్ట్‌ చాయిస్‌‌ టీ20 ప్లేయర్ల సేవలను కోల్పోయిన ఆసీస్‌‌ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఈ మ్యాచ్‌ లో ఓడితే సిరీస్‌‌ కోల్పోతుంది కాబట్టి కంగారూలు ఎలాంటి ప్లాన్‌‌తో దిగుతారో చూడాలి. ఫించ్‌ గైర్హాజరైతే డార్సీ షార్ట్‌‌తో కలిసి వేడ్‌ ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేస్తాడు. ఫస్ట్‌ మ్యాచ్‌‌లో షార్ట్‌ తేలిపోయాడు. దాంతో, స్మిత్‌‌, మ్యాక్స్‌ వెల్‌‌పై భారం పడనుంది. అయితే, టీ20ల్లో స్మిత్‌‌కు మంచి రికార్డు లేదు. ఇంకోవైపు లాస్ట్‌ వన్డే, ఫస్ట్‌ టీ20ల్లో మ్యాక్స్‌ వెల్‌‌.. బుమ్రా, నటరాజన్‌ బౌలింగ్‌‌లో ఇబ్బంది పడ్డాడు. బౌలింగ్‌‌లో హేజిల్‌‌వుడ్‌ మినహా మిగతా ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే, టెస్టు స్పెషలిస్ట్‌ నేథన్‌ లైయన్‌‌ను టీ20 టీమ్‌‌లోకి తీసుకున్న హోమ్‌ టీమ్‌ ఆశ్చర్యపరిచింది. స్వెప్సన్‌ ప్లేస్‌‌‌లో తుది జట్టులోకి తీసుకొని లైయన్‌‌తో పవర్‌ ప్లేలో బౌలింగ్‌‌ చేయించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌‌లో ఇండియా సుందర్‌‌తో చేసిన ఈ ప్రయోగం సక్సెస్‌‌ అయింది. మరి, ఆసీస్‌‌కు వర్కౌ ట్‌ అవుతుందో లేదో చూడాలి.

జట్లు (అంచనా):

ఇండియా: ధవన్‌ , రాహుల్‌‌, కోహ్లీ, శాంసన్ , పాండే/అయ్యర్‌‌, హార్దిక్‌, సుందర్‌‌, దీపక్‌, నటరాజన్, బుమ్రా/షమీ, చహల్‌‌.
ఆస్ట్రేలియా: ఫించ్‌ /షార్ట్‌, వేడ్‌‌, స్మిత్‌, మ్యాక్స్‌ వెల్‌‌, హెన్రిక్స్‌, క్యారీ, అబాట్‌‌, స్టార్క్‌ , స్వెప్సన్​/లైయన్‌, జంపా, హేజిల్‌‌వుడ్‌‌.

పిచ్‌ /వాతావరణం
ఫ్లాట్‌‌ వికెట్‌‌. బ్యాటింగ్‌‌కు అనుకూలం. అయితే, ఫస్ట్‌ రెండు వన్డేల్లో మాదిరిగా ఆట సాగే కొద్దీ బౌలర్లకు సహకారం లభించనుంది. ఆదివారం రాత్రి వర్ష
సూచన లేదు.