- పంచుకుంటరా.. ఇచ్చేస్తరా!
- రా. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
జొహన్నెస్‌బర్గ్: బౌలింగ్ వైఫల్యంతో సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఓడిన ఇండియా.. ఇప్పుడు సిరీస్‌ను పంచుకోవడంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు నాలుగే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో మెరుగైన కాంబినేషన్‌ను ఎంచుకునేందుకు పెద్దగా అవకాశం కూడా లేదు.
కాబట్టి ఈ మ్యాచ్ నుంచే సరైన కోర్ టీమ్‌ను గుర్తించాలని చీఫ్ కోచ్ ద్రవిడ్ బృందం భావిస్తోంది. అయితే సీనియర్ల ప్లేస్‌లో వచ్చిన జూనియర్ బౌలర్లెవరూ అంచనాలు అందుకోకపోవడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ ఓవర్‌కు సగటున 15.50, 11.33 రన్స్ ఇవ్వడం ప్రతికూలాంశంగా కనిపిస్తున్నది. గత పోరులో వర్షం, మంచు ప్రభావం వల్ల ఇలా జరిగిందని నిరూపించాలంటే ఈ ఇద్దరూ మూడో టీ20లో చెలరేగాలి.
వ్యక్తిగత కారణాలతో దీపక్ చహర్, రెస్ట్ కారణంగా బుమ్రా లేకపోవడం, రిజర్వ్ బెంచ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఇద్దర్నే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. 16 నెలల తర్వాత తొలి టీ20 ఆడిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా నిరాశపర్చడం ఆందోళన కలిగిస్తున్నది. సెకండ్ స్పిన్నర్‌గా కుల్దీప్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్‌కు చాన్స్ ఇస్తారేమో చూడాలి.
బ్యాటింగ్ పరంగా కూడా ఇండియాకు ఇబ్బందులు మొదలయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన యశస్వి జైస్వాల్, గిల్ డకౌట్ కావడంతోనే రెండో టీ20లో ఇండియా ఓటమికి బీజం పడింది. అనారోగ్యం నుంచి కోలుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. తిలక్ వర్మ, సూర్య కుమార్, రింకూ సింగ్‌ను మార్చే చాన్స్ లేదు. శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం లేనట్లే. కీపర్‌గా, ఫినిషర్‌గా జితేశ్ శర్మ పోరాటం సరిపోవడం లేదు. ఓవరాల్‌గా జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇండియా మూడింటిలో నెగ్గింది. ఇప్పుడు అదే రికార్డును కొనసాగించాలంటే బౌలర్లు చెలరేగాలి.
సిరీస్‌పై సఫారీల గురి
గత పోరులో14 ఓవర్లలోనే 150 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేసిన సౌతాఫ్రికా ఇప్పుడు సిరీస్‌పై గురిపెట్టింది. అయితే రెండో మ్యాచ్‌లో రాణించిన బౌలర్లు కోయెట్జీ, జాన్సెన్, ఎంగిడి ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. రెడ్ బాల్ మ్యాచ్‌లకు ప్రిపేర్ అయ్యేందుకు ఈ త్రయం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో పేసర్లుగా ఫెలుక్వాయో, లిజాద్ విలియమ్స్‌కు తోడుగా ఒట్నీల్ బార్ట్‌మన్ బరిలోకి దిగొచ్చు. లేదంటే ఆల్‌రౌండర్లు నాండ్రీ బర్గర్, డోనోవాన్ ఫెరీరాలో ఒకరికి అవకాశం రావొచ్చు. స్పిన్నర్లు షంసి, కేశవ్ మహారాజ్ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్యాటింగ్‌లో హెండ్రిక్స్, కెప్టెన్ మార్‌క్రమ్, బ్రీట్జ్‌కే, క్లాసెన్ మరోసారి కీలకం కానున్నారు.