పులులు పెరుగుతున్నయ్

దేశంలో పులుల సంఖ్య పెరుగుతుండటం శుభసూచికం. అయితే పెరుగుతున్న పులుల సంఖ్యకు సరిపోను ఆవాసాలు, రక్షణ చర్యలు మన దగ్గర ఉన్నాయా? మన దేశం ఎన్ని పులులకు ఆశ్రయం కల్పించగలదు? పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సమతుల్యత ఏ విధంగా ఉన్నదనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దేశంలో ప్రస్తుతం 3,167 పులులు ఉండగా.. మరో వెయ్యి, 1500 పులులకు మించి భారత దేశం ఆశ్రయం కల్పించలేదని టైగర్ ​ప్రాజెక్ట్​ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం కర్నాటకలోని మైసూరులో ఉన్న బండీపుర టైగర్​రిజర్వ్​లో పర్యటించారు. పెద్దపులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, ఫ్యూమ, జాగ్వార్​ తదితర ఏడు రకాల క్రూర మృగాల సంరక్షణ కోసం ఐబీసీఏ(ఇంటర్నేషనల్​ బిగ్​కేట్​ అలయన్స్) కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. వచ్చే 25 ఏండ్లలో పెద్దపులుల సంరక్షణకు చేపట్టనున్న కార్యాచరణపై రాసిన ‘అమృత్​కాల్​కా టైగర్ ​విజన్​’ బుక్​లెట్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతుండటం మన దేశంతోపాటు ప్రపంచం కూడా గర్వించాల్సిన అంశమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా ప్రపంచ పులుల సంఖ్యలో 75 శాతం భారత్​లోనే ఉండటం గర్వకారణమన్నారు. పులుల సంరక్షణకు దేశంలో 75 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేటాయించామని, పన్నెండు ఏండ్లలో పెద్ద పులుల సంఖ్య 75 శాతం పెరిగిందన్నారు.

గరిష్ట స్థాయికి చేరనున్నాయా ?

ప్రాజెక్ట్​ టైగర్​ స్వర్ణోత్సవాల సందర్భంగా తాజాగా కేంద్రం పులుల పెరుగుదలపై నివేదిక విడుదల చేసింది. దేశంలోని శివాలిక్​పర్వతాలు, గంగామైదాన ప్రాంతాలు, మధ్య భారతం, సుందర్​బన్స్​ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్రం తెలిపింది.  2018లో దేశంలో 2,967 పులులు ఉంటే 2022 నాటికి వాటి సంఖ్య 3,167కు పెరిగింది. దేశం మొత్తంగా 5000 పులులకు మించి ఆశ్రయం కల్పించలేదనేది నిపుణుల మాట. 19వ శతాబ్దం చివరి నాటికి దేశంలో 40,000 పులులు ఉండేవి. అయితే ఆ సమయంలో భారతదేశంలోని ఎక్కువ భాగం అడవులతో నిండి ఉండేది. జనాభా పెరుగుతున్న కొద్దీ, పులుల ఆవాసాలు చిన్నా భిన్నం అయిపోయాయి. ప్రస్తుతం సుమారు 300,000 చదరపు కి.మీ ప్రాంతంలో 90,000 చదరపు కి. మీ ఆవాసంలో మాత్రమే పులులు ఉన్నట్లు అంచనా. చత్తీస్‌‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, అరుణాచల్​ప్రదేశ్, మిజోరాంలో మరో 1,000 నుంచి-1,500 పులులకు వసతి కల్పించగలదని జీవశాస్త్రవేత్త, వైల్డ్‌‌లైఫ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ డీన్ యూవై ఝలా అంటున్నారు. దేశంలోని అనేక ఆవాసాల్లో పులుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. ప్రాజెక్ట్ టైగర్‌‌తో 35 ఏండ్లకుపైగా అనుబంధం ఉన్న, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మాజీ చీఫ్​ రాజేష్ గోపాల్ తెలిపారు. 50 ఏండ్లుగా చేపడుతున్న టైగర్ ప్రాజెక్ట్​ చర్యలతో పులుల కౌంట్​ సంతృప్త స్థానానికి చేరుకుందని, చాలా టైగర్​ రిజర్వ్​లు పూర్తి స్థాయి సామర్థ్యానికి దగ్గరగా ఉన్నాయన్నారు.  ‘50 ఏండ్ల ప్రాజెక్ట్ టైగర్: సవాళ్లు, ముందుకు వెళ్లే మార్గం’పై రాజేష్​ గోపాల్​ఒక మోడల్​ను అందిస్తూ.. పులుల సంరక్షణను పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సు సూచికగా పరిగణించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అమృత్ కాల్ కా టైగర్ విజన్‌‌ను ప్రస్తావిస్తూ.. జీవవైవిధ్య పరిరక్షణకు పులి ఒక గొడుగులా ఉండాలని చెప్పారు. పులులు ఉంటున్న అడవులను టైగర్ రిజర్వ్​ల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. అయితే.. పులులను లెక్కించే పద్ధతిపైనా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడున్న విధానాన్ని పూర్తిగా విశ్వసించలేమని జంతు సంరక్షణ కార్యకర్తలు అంటున్నారు. పులులను లెక్కించే ప్రక్రియ పూర్తిగా సాంకేతికంగా సాగుతుందని, అలాంటి సర్వేల్లో మనుషుల ప్రమేయం అస్సలు ఉండదనేది వారి మాట.

రక్షణ చర్యలు ముఖ్యం

దేశంలో మొత్తంగా పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా.. పశ్చిమ కనుమలు, ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాల్లో వీటి  సంఖ్య తగ్గుతున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వేటాడటం. ఎన్టీసీఏ లెక్కల ప్రకారం గత  పదేండ్లలో 1059 పులులు మృతి చెందాయి.  మరణాలు మధ్యప్రదేశ్‌‌లో ఎక్కువ. అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది 38 పులులు మరణించాయి. ఇదీగాక భారత ప్రభుత్వం 2006లో ఆమోదించిన అటవీ హక్కుల చట్టం అటవీ ప్రాంతాల్లోని కొన్ని అటవీ- నివాస జాతుల హక్కులను గుర్తిస్తున్నది. దీని వల్ల పులుల ఆవాసాలు దెబ్బతింటున్నాయి. అయితే కొన్ని గిరిజన తెగలు పులుల సంరక్షణలో ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అరుణాచల్​ప్రదేశ్​లోని అడవుల్లో ఉండే ఇడు మిష్మీ తెగకు చెందిన గిరిజనులు పులులను సోదరులుగా భావిస్తారు. అలాంటి తెగలకు చెందిన వారు పులుల రక్షణకు తోడ్పడుతున్నారు. పులులు, ఆసియా ఏనుగులు, ఒకే కొమ్ము ఖడ్గమృగాలు, ఆసియా సింహాలు ఇంకా మన దేశంలో ఉన్నాయనడానికి కారణం.. ప్రజల సహకారమే.  పులులతోపాటు అడవిలో ఇతర వన్యప్రాణుల సమతుల్యత ఎంతో అవసరం. అందు కోసం ప్రభుత్వాలు, అధికారులతోపాటు ప్రజలు వారి వారి స్థాయిలో కృషి చేయాల్సి ఉంటుంది. పులుల భవిష్యత్తును కాపాడేందుకు12 జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికలు,13 రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికలు,14 క్షేత్రస్థాయి లేదా టైగర్ రిజర్వ్-స్థాయి ప్రణాళికలు ఉన్నాయి.

తెలంగాణలో ‘వెరీ గుడ్’, ‘గుడ్’..​​

తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌‌లు పులుల సంరక్షణలో మంచి పాత్ర పోషిస్తున్నాయి. మేనేజ్‌‌మెంట్ ఎఫెక్టివ్‌‌నెస్ ఎవాల్యుయేషన్(ఎంఈఈ)లో ఈ రెండు కేంద్రాలు వరుసగా ‘వెరీ గుడ్’, ‘గుడ్’ ర్యాంకులు పొందాయి. అమ్రాబాద్ రిజర్వ్ 78.7%, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 74.2% స్కోర్ సాధించాయి. అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్​టీసీఏ) నివేదిక 2023 ప్రకారం జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో పులుల సంఖ్య తగ్గింది. ఈ రాష్ట్రాల్లోని పులుల రక్షిత ప్రాంతాలను కాపాడాలని, పెద్ద పులుల సంఖ్యను పునరుద్ధరించడానికి తీవ్రమైన పరిరక్షణ ప్రయత్నాలు అవసరమని ఎన్​టీసీఏ తెలిపింది.
–కాశెట్టి కరుణాకర్,సీనియర్​ జర్నలిస్ట్