- 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ
- గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారే చాన్స్
- ఇంకో ఆరేళ్లలో ఎగుమతులు .. 2 ట్రిలియన్ డాలర్లకు: ఐడీబీఐ క్యాపిటల్
న్యూఢిల్లీ: ప్రతీ 18 నెలలకు జీడీపీని ఒక ట్రిలియన్ డాలర్లు పెంచుకోవాలని ఇండియా చూస్తోంది. ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుండడంతో 2032 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని అంచనా. ఐడీబీఐ క్యాపిటల్ రిపోర్ట్ ప్రకారం, ఇంకో ఆరేళ్లలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఇది సాధించడంలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కీలక పాత్ర పోషించనుంది. పెరిగే గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) లో 32 శాతం వాటా ఈ సెక్టార్ నుంచి వస్తుందని ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేసింది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఇండియా మారడంలో మేకిన్ ఇండియా వంటి ఇనీషియేటివ్స్ కీలకంగా ఉంటాయని తెలిపింది.
కాగా, ఇండియా జీడీపీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి సుమారు 63 ఏళ్లు పట్టింది. 1947 నుంచి చూస్తే 2010 లో ఈ మైలురాయిని చేరుకోగలిగింది. దేశ జీడీపీ 2017 నాటికి రెండు ట్రిలియన్ డాలర్లకు, 2020 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. గత పదేళ్లలో జీడీపీ వేగంగా వృద్ధి చెందిందనే విషయం ఈజీగా అర్థమవుతోంది. కరోనా సంక్షోభం వలన ఎకానమీ గ్రోత్ కొంత ఆలస్యమయ్యింది.
లేకపోతే 2024 నాటికి దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయాలి. కానీ, సమీప భవిష్యత్‌లో ఈ టార్గెట్‌ను చేరుకుంటామని ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేస్తోంది. 2024–2032 మధ్య జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. ‘మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో డిమాండ్ బాగుండడం, ఎగుమతులు పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్‌ఐ) వంటి ప్రభుత్వ పాలసీలు జీడీపీ పెరగడంలో కీలకంగా ఉంటాయి’ అని వివరించింది.
తయారీలో యూఎస్, చైనా, జపాన్‌ను దాటి..
తయారీలో అమెరికా, చైనా, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలను ఇండియా దాటగలదని ఐడీబీఐ క్యాపిటల్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) లో ఈ దేశాలను అధిగమిస్తామని తెలిపింది. ‘మాన్యుఫాక్చరింగ్ ఐఐపీఓలో ఐదు ఆర్థిక వ్యవస్థలు..యూఎస్, చైనా, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్‌లను ఇండియా అధిగమిస్తుంది. ప్రభుత్వ పాలసీలు, మెరుగైన వ్యాపార పరిస్థితుల వలన ఇండియాలో కూడా తయారీ రంగం ఈ దేశాల సరసన చేరుతుంది’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది. దేశం నుంచి ఎగుమతులు పుంజుకున్నాయని, 2030 నాటికి జీడీపీలో ఎగుమతుల వాటా 25 శాతానికి చేరుకుంటుందని, 2 ట్రిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని అంచనా వేసింది.
ఇండియా ఎగుమతులు 2000 లో 61 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 నాటికి 776.7 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. డొమెస్టిక్ డిమాండ్ పెరగడం, ప్రజల ఆదాయాలు మెరుగవ్వడం, గ్లోబల్‌గా సప్లయ్ చెయిన్‌లో మార్పులు రావడం, ఎగుమతులు పెంచుకునే సామర్ధ్యం, ఫైనాన్షియల్‌గా మెరుగైన వాతావరణం ఉండడం వంటి అంశాలు ఇండియా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్, ఎక్స్‌పోర్ట్స్ పెరగడంలో కీలకంగా పనిచేయనున్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టార్ ఖర్చులు పెరుగుతుండడంతో గ్లోబల్‌గా అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా ఎదుగుతుందని ఐడీబీఐ క్యాపిటల్ రిపోర్ట్ పేర్కొంది.