- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం
- బడ్జెట్‌లో రూ.10 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి
- రూ.40 లక్షలు దాటితేనే 30 శాతం ట్యాక్స్ వేయాలి: కేంద్రానికి పీహెచ్‌డీసీసీఐ సలహా
న్యూఢిల్లీ: ఇంకో ఏడాదిలోపు ఇండియా నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ (పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేస్తోంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి నెమ్మదించిందని, అయినప్పటికీ ఇండియా మాత్రం మంచి గ్రోత్ నమోదు చేస్తోందని పేర్కొంది. మన ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉందని, వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరిస్తే భారీగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని వివరించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం వృద్ధి చెందుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం పెరుగుతుంది. 2026 లో జపాన్‌ను దాటేస్తుంది.
వడ్డీ రేట్లను తగ్గించాల్సిన టైమొచ్చింది
వచ్చే నెల జరిగే పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు ఆర్‌బీఐ తగ్గించాలని పీహెచ్‌డీడీసీఐ సలహా ఇచ్చింది. రానున్న నెలల్లో ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుందని పేర్కొంది. ‘రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుతోంది. కాబట్టి వచ్చే పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలి. ఆహార పదార్థాల ధరలను కొలిచే ఇన్‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉంది. అయినప్పటికీ ఓవరాల్‌గా ఇన్‌ఫ్లేషన్ తగ్గుతుందని నమ్ముతున్నాం.
రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రానున్న క్వార్టర్లలో 4 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం’ అని పీహెచ్‌డీసీసీఐ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఎస్‌పీ శర్మ అన్నారు. ఈ సంస్థ అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 4.5 శాతం దగ్గర ఉంటుంది. ఇండియా అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిన్‌టెక్, సెమీ కండక్టర్, రెన్యూవబుల్ ఎనర్జీ, హెల్త్, ఇన్సూరెన్స్, వంటి సెక్టార్లపై ఫుల్ ఫోకస్ పెట్టాలి. అలానే సస్టయినబుల్ డెవలప్‌మెంట్‌కు కట్టుబడి ఉండాలి.
‘ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను పెంచాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపర్చాలి. వ్యాపారం చేసుకోవడానికి అయ్యే ఖర్చులు తగ్గించాలి. లేబర్స్ ఎక్కువగా అవసరముండే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌పై ఫోకస్ పెట్టాలి. గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో కలిసిపోవాలి. రానున్న సంవత్సరాల్లో ఇండియా ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేలా చూడాలి’ వంటి సలహాలను ప్రభుత్వానికి పీహెచ్‌డీసీసీఐ ఇచ్చింది.
ట్యాక్స్‌లు తగ్గించండి
రానున్న బడ్జెట్ కోసం పీహెచ్‌డీసీసీఐ కొన్ని సిఫార్సులు చేసింది. ఆదాయాలపై వేసే గరిష్ట ట్యాక్స్ 30 శాతాన్ని ఏడాదికి రూ.40 లక్షలకు పైన సంపాదించేవారిపైనే వేయాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటోంది. రూ.10 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. అలా అయితే ప్రజల దగ్గర డబ్బులు మిగులుతాయని, వినియోగం ఊపందుకుంటుందని అంచనా వేస్తోంది. పార్టనర్‌షిప్, ఎల్‌ఎల్‌పీ విధానంలోని సంస్థలపై ప్రస్తుతం 33 శాతం ట్యాక్స్ పడుతుండగా, దీనిని 25 శాతానికి తగ్గించాలని సిఫార్స్ చేసింది.