- ఆ దిశగా ఆలోచిస్తున్నాం
- కెనడా విదేశాంగ మంత్రి వెల్లడి
- అంతా టేబుల్ పైనే ఉందని కామెంట్
టొరంటో: భారత్–కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించనున్నాయి. ఇండియాపై తాము ఆంక్షలు విధించే అవకాశం ఉందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. ‘‘ఆంక్షలు విధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా టేబుల్ పై ఉంది” అని ఎక్స్ లో జోలీ తెలిపారు. నిరుడు జూన్ లో తమ దేశంలో హత్యకు గురైన ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్ సీఎంపీ) సాక్ష్యాధారాలు సేకరించామని ఆమె చెప్పారు.
ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే తమ దేశం నుంచి భారత దౌత్యవేత్తలను బహిష్కరించామని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. ఇరు దేశాల పరస్పర లబ్ధి కోసం దర్యాప్తుకు ఇండియా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కెనడియన్ల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జోలీ చెప్పారు. కాగా.. ఖలీస్తానీ టెర్రరిస్టులకు కెనడా ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించిన నేపథ్యంలో కెనడా ఈవిధంగా స్పందించింది.
బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు..
భారత ఏజెంట్లతో బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నాయని కెనడా పోలీసులు ఆరోపించారు. తమ దేశంలో దక్షిణాసియా కమ్యూనిటీ వారిని, ఖలీస్తానీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవడానికి బిష్ణోయ్ గ్యాంగ్ క్రిమినల్స్‌ను ఇండియా ప్రభుత్వ ఏజెంట్లు వాడుకుంటున్నారని కమిషనర్ మైక్ డుహెనె, డిప్యూటీ కమిషనర్ బిగ్రిట్ గౌవిన్ ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.
అగ్గి రాజేసిన ట్రూడో
నిజ్జర్ హత్య జరిగిన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. తమ దేశంలో కెనడా పౌరులనే లక్ష్యంగా చేసుకుంటూ భారత్ నేరాలకు పాల్పడుతోందని ట్రూడో పలుమార్లు ఆరోపించారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాల మధ్య అగ్గి రాజేసినట్లయింది. మరోవైపు ట్రూడో ఆరోపణలను భారత్ ఖండిస్తూ వస్తోంది. ఆయన చేసిన ఆరోపణలు అర్థంపర్థం లేనివని, అవాస్తవాలని పేర్కొంది. తాజాగా ట్రూడో సర్కారు భారత దౌత్యవేత్తల పేర్లను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ జాబితాలో చేర్చడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
వీసా సేవలపై ప్రభావం
భారత్ –కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆ ప్రభావం వీసా సేవలపై పడింది. కెనడా పౌరులకు నెలరోజులు వీసాల జారీని నిలిపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వారు ఇండియన్ వీసాకు అప్లై చేసుకోవడానికి వీలు లేదు.