న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ నిర్దేశించిన డ్రెస్ కోడ్‌తోనే బరిలోకి దిగుతామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. తమ టీమ్ అధికారిక జెర్సీపై పాకిస్తాన్ పేరును ఉంచేందుకు ఇండియా అభ్యంతరాలు చెప్పిందని వచ్చిన ఊహాగానాలు ఆయన తోసిపుచ్చారు. ‘మెగా టోర్నీలో టీమిండియా ధరించే జెర్సీలన్నీ ఐసీసీ నియమాలకు లోబడే ఉంటాయి. లోగో, డ్రెస్ కోడ్‌కు సంబంధించి వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా మేం అనుసరిస్తాం.
మిగతా జట్ల మాదిరిగానే మేం కూడా నిజమైన స్ఫూర్తితోనే ఆడతాం’ అని సైకియా స్పష్టం చేశారు. అయితే టోర్నీకి ముందు లాహోర్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్, అధికారిక ఫొటో షూట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొంటాడా? లేదా? అన్న అంశాన్ని చర్చిస్తున్నామన్నారు. ఐసీసీ మీడియా ఎంగేజ్‌మెంట్ విషయంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెల 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుండగా, తర్వాతి రోజు బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడుతుంది.