- ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశీయ తయారీని మరింత పెంచేందుకు గ్రేటర్ నోయిడా, గుజరాత్‌లోని ధోలేరా వంటి చోట్ల 12 కొత్త పారిశ్రామిక నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో రెండు, బీహార్‌లో ఒకటి రానున్నాయి. పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఎనిమిది నగరాలు ఇప్పటికే వివిధ దశల్లో అమలులో ఉన్నాయని చెప్పారు.
ధోలేరా (గుజరాత్), ఆరిక్ (మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగ్‌పురి (మధ్యప్రదేశ్), కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్) నగరాల్లో మౌలిక సదుపాయాలు సృష్టించామని, పరిశ్రమ కోసం భూమి కేటాయింపు జరుగుతోందని వివరించారు. మిగిలిన నాలుగింటిలో స్పెషల్ పర్పస్ వెహికల్ రోడ్డు కనెక్టివిటీ, నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇప్పటికే ఎనిమిది నగరాలు అభివృద్ధి దశలో ఉన్నాయని, బడ్జెట్‌లో కొత్తగా 12 నగరాలను ప్రకటించడంతో దేశంలోని ఈ నగరాల సంఖ్య 20కి చేరిందని సింగ్ తెలిపారు.