అమ్మాయిలకు ఎదురుందా!..నేడు వెస్టిండీస్‌‌తో ఇండియా రెండో వన్డే  మ్యాచ్‌ 

అమ్మాయిలకు ఎదురుందా!..నేడు వెస్టిండీస్‌‌తో ఇండియా రెండో వన్డే  మ్యాచ్‌ 
  • మ. 1.30 నుంచి స్పోర్ట్స్‌‌–18, జియో సినిమాలో లైవ్

వడోదరా : వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌‌ నెగ్గి జోరుమీదున్న ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ వన్డే సిరీస్‌‌పై కన్నేసింది. మంగళవారం కరీబియన్లతో జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్‌‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌‌ కప్‌‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. తొలి వన్డేలో భారీ విజయం జోష్‌ను ఈ మ్యాచ్‌‌లోనూ కొనసాగించేందుకు రెడీ అయింది. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత ఏడుగురు కొత్త వారికి చాన్స్‌‌ ఇచ్చిన ఇండియా జట్టు వన్డే వరల్డ్ కప్‌ లో ఆడే టీమ్‌‌పై తుది కసరత్తును మొదలుపెట్టింది.

ALSO READ : IND vs AUS: బుమ్రాకు భయపడేవాడిని కాదు.. ధీటుగా ఎదుర్కొంటా..: సామ్ కొంటాస్

దీంతో విండీస్‌‌తో రాబోయే రెండు వన్డేల్లో బ్యాటర్లు సత్తా చాటాలని భావిస్తున్నారు. టీ20లతో పాటు వన్డేల్లోనూ దుమ్మురేపుతున్న మంధాన ఇండియా లైనప్‌‌కు కొండంత అండగా నిలుస్తోంది. మోకాలి నొప్పి నుంచి కోలుకున్న కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ తొలి వన్డేలో  రాణించింది. ఇక, ఇప్పటికే టీ20 సిరీస్‌‌ కోల్పోయిన విండీస్‌‌.. ఈ సిరీస్‌‌నైనా నెగ్గాలని ఆశిస్తోంది. అయితే, తొలి వన్డేలో పూర్తిగా తేలిపోయిన నేపథ్యంలో  ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.