2030 నాటికి 120 కోట్ల స్మార్ట్​ఫోన్లు

2030 నాటికి 120 కోట్ల స్మార్ట్​ఫోన్లు
  • సగం మందికి 5జీ కనెక్టివిటీ
  • భారీగా పెరగనున్న డేటా వాడకం వెల్లడించిన జీఎస్​ఎంఏ రిపోర్ట్​

న్యూఢిల్లీ : మనదేశంలో స్మార్ట్​ఫోన్​ వాడకం జెట్​స్పీడ్​తో దూసుకెళ్లనుందని వెల్లడయింది. 2030 నాటికి ఇండియాలో 120 కోట్ల స్మార్ట్‌‌ఫోన్ కనెక్షన్‌‌లు ఉంటాయని, వీరిలో సగం మంది వినియోగదారులు 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌లను ఉపయోగిస్తారని తాజా రిపోర్ట్​తెలిపింది. గ్లోబల్ మొబైల్ నెట్‌‌వర్క్ సంస్థ జీఎస్​ఎంఏ ప్రకారం, దేశంలో 2030 నాటికి 64.1 కోట్లమందికి పైగా 5జీ కస్టమర్ల ఉంటారు. ఏటా 5జీ యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. రాబోయే ఆరేళ్లలో డేటా వినియోగంలో ఊహించలేనంతంగా దూసుకెళ్తుంది. 5జీ యూజర్ల సంఖ్య విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. 

నెట్​వర్క్​ విస్తరణకు టెల్కోలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి.  ప్రతి సబ్‌‌స్క్రయిబర్​కు డేటా వినియోగం 2023– 2029 మధ్యకాలంలో వార్షికంగా 15 శాతం పెరిగి నెలకు 68 జీబీకి చేరుకునే అవకాశం ఉంది. ఆసియా-–పసిఫిక్ ప్రాంతంలో ఇండియా, ఇండోనేషియాలు డిజిటలైజేషన్​లో ముందున్నాయని జీఎస్​ఎంఏ ‘మొబైల్ ఎకానమీ ఆసియా పసిఫిక్ 2024 రిపోర్ట్​’ తెలిపింది. 

2030 నాటికి ఇండోనేషియాలో స్మార్ట్​ఫోన్ల సంఖ్య 38.7 కోట్లకు చేరుకుంటుంది.  మొబైల్ టెక్నాలజీలు, సేవలు 2023లో ఏపీఏసీ ప్రాంతం అంతటా జీడీపీలో 5.3 శాతం వాటాను, 880 బిలియన్ డాలర్ల ఆర్థిక విలువను అందించాయి. దాదాపు 1.3 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి.  5జీ కోసం అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ 2030 నాటికి మనదేశ  జీడీపీకి సుమారు 27 బిలియన్ డాలర్లను అందించే అవకాశం ఉంది. 

 టెల్కోల ఆదాయం రెండేండ్లలో రూ. 5 లక్షల కోట్లకు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యల వల్ల టెలికాం రంగ ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ. 5 లక్షల కోట్లు దాటవచ్చని టెలికాం శాఖ సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్ టెలికం (డాట్​)  డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీష్ సిన్హా మాట్లాడుతూ ..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ సెక్టార్​కు గత మూడేళ్లలో ఎంతో మేలు జరిగిందని చెప్పారు. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ప్రస్తుత పద్ధతులను మార్చాలని,  డైనమిక్ స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి కొత్త పద్ధతులకు మారాలని అభిప్రాయపడ్డారు. 

 సెక్టార్ రెగ్యులేటర్ ట్రాయ్ నివేదిక ప్రకారం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయం సంపాదించారు.  ఈ ఏడాది టెలికాం రంగం స్థూల ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని తనకు సమాచారం ఉందని సిన్హా చెప్పారు.   టెలికాం ఆపరేటర్లు పాత వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్  పూర్తి విలువను పొందలేకపోయారని, 10 లేదా 20 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధికి బదులుగా తక్కువ కాలానికి స్పెక్ట్రమ్‌‌ను కేటాయించడం మేలని భావిస్తున్నారని సిన్హా చెప్పారు. కేంద్రం  స్పెక్ట్రమ్​ సమస్యలను పరిష్కరించడంపై పనిచేస్తోందని వివరించారు.