
న్యూఢిల్లీ: రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. 2025 సంవత్సరంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సగటున105 శాతం వర్షపాతం నమోదు అవుతుందని వెల్లడించింది. వాయువ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. ఇక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. రుతుపవనాల సమయంలో తటస్థ ఎల్ నినో పరిస్థితులు ఉంటాయని.. ఇది రుతుపవన పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
Also Read :- సామాన్యులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
కాగా, భారతదేశంలో రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దక్షిణ రాష్ట్రమైన కేరళలో ప్రారంభమై సెప్టెంబర్ మధ్యకాలం వరకు కొనసాగుతాయి. భారత వాతావరణ శాఖ సాధారణ వర్షపాతాన్ని 50 సంవత్సరాల సగటు వర్షపాతం 87 సెం.మీ ప్రామాణికంగా తీసుకుని 96% నుంచి 104% మధ్య పడుతుందని అంచనా వేస్తుంది. దీని ఆధారంగా ఈ ఏడాది 105 శాతం వర్షపాతం అంటే.. సగటు కంటే ఎక్కువే. ఇది వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఐఎండీ అంచనా.
ఐఏండీ అంచనా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు శుభవార్త లాంటిందే. ఎందుకంటే దేశంలోని నికర సాగు విస్తీర్ణంలో 52% రుతుపవనాల వర్షాలపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడితే.. ఇది పంట ఉత్పత్తికి, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాల నింపడానికి చాలా ఉపయోగపడుతోంది.