- 24 రన్స్ తేడాతో ఆసీస్ ఓటమి
- మెరిసిన రోహిత్, బౌలర్లు
- నేడు బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటికే
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా) : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్ శర్మ (41 బాల్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92) సూపర్ హిట్ బ్యాటింగ్‌కు తోడు బౌలర్లూ చెలరేగిన వేళ టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్‌ను సెమీస్‌కు ముందే ఇంటిదారి పట్టే పరిస్థితిలో నిలిపింది. సోమవారం జరిగిన సూపర్8 రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 24 రన్స్ తేడాతో విజయం సాధించి 6 పాయింట్లతో గ్రూప్–-1 టాపర్‌గా సెమీస్ చేరింది. ఆసీస్ 2 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. మంగళవారం జరిగే చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే కంగారూ టీమ్ టోర్నీ నుంచి వైదొలగనుంది.
రోహిత్ మెరుపులతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఆసీస్ 181/7స్కోరు మాత్రమే చేసి ఓడింది. ట్రావిస్ హెడ్ (43 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) పోరాడినా ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లతో ఆ టీమ్‌ను నిలువరించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఇండియా.. ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది.
రోహిత్ ధనాధన్
ఫ్లాట్ వికెట్‌పై టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియాకు స్టార్టింగ్‌లోనే షాక్ తగిలింది. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో పుల్ షాట్‌కు ట్రై చేసి విరాట్ కోహ్లీ (0) డకౌటయ్యాడు. అప్పటికే బౌండ్రీల ఖాతా తెరిచిన రోహిత్ ఒక్కసారిగా టాప్ గేర్‌లోకి వచ్చేశాడు. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఖతర్నాక్ షాట్లతో 6, 6, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ ఓవర్లో ఏకంగా 29 రన్స్ వచ్చాయి. వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ (15) జాగ్రత్తగా ఆడగా.. మరో ఎండ్‌లో రోహిత్ జోరు కొనసాగించాడు. కమిన్స్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 4 కొట్టి 19 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
అతని జోరుతో పవర్ ప్లేలో ఇండియా 60/1 స్కోరు చేసింది. ఇందులో రోహిత్ చేసిన రన్స్ 51 కావడం విశేషం. ఫీల్డింగ్ మారినా ఇండియా కెప్టెన్ అదే జోరు కొనసాగించాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో పంత్ ఔటైనా రోహిత్ స్పీడుతో తొమ్మిది ఓవర్లలోనే స్కోరు వంద దాటింది..స్టోయినిస్ బౌలింగ్ మరో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి రాగా.. కమిన్స్ ఓవర్లో .. సూర్యకుమార్ (31) 4, 6తో అలరించాడు. అయితే, 12వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన స్టార్క్.. పర్‌ఫెక్ట్ యార్కర్‌తో రోహిత్‌ను బౌల్డ్ చేసి అతని సెంచరీని అడ్డుకున్నాడు. ఇక్కడి నుంచి సూర్య, దూబే (28) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి 14 ఓవర్లకే స్కోరు 150 దాటించారు.
ఈ టైమ్‌లో ఆసీస్ బౌలర్లు పుంజుకున్నారు. జోరు మీదున్న సూర్యను ఔట్ చేసి నాలుగు ఓవర్లలో రెండే ఫోర్లు ఇచ్చారు. అయితే,, స్టోయినిస్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా (27 నాటౌట్) ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తీసుకురాగా.. ఆఖరి ఓవర్లో జడేజా (9 నాటౌట్) సిక్స్‌తో స్కోరు 200 దాటించాడు.
హెడ్ దంచినా.. బౌలర్లు దించారు..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో తొలి ఓవర్లోనే ఊరించే ఔట్ స్వింగర్‌తో ఓపెనర్ వార్నర్ (4)ను ఔట్ చేసిన అర్ష్‌దీప్ ఆసీస్‌కు షాకిచ్చాడు. కానీ, బుమ్రా ఓవర్లో మిచెల్ మార్ష్ (37) ఇచ్చిన టఫ్ క్యాచ్‌ను పంత్ వదిలేయగా.. తన బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్‌ను అర్ష్‌దీప్ డ్రాప్ చేశాడు. ఈ చాన్స్‌లను సద్వినియోగం చేసుకున్న మార్ష్ భారీ షాట్లతో హోరెత్తించాడు. అర్ష్‌దీప్ ఓవర్లో 4, 6 కొట్టాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ కూడా ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలోనే ఆసీస్ 65/1తో నిలిచింది. కుల్దీప్ వేసిన తొమ్మిదో ఓవర్లో బౌండ్రీ లైన్ దగ్గర అక్షర్ పట్టిన చురుకైన క్యాచ్‌కు మార్ష్ ఔటైనా..
హెడ్ వెనక్కు తగ్గలేదు. హార్దిక్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. మ్యాక్స్‌వెల్ (20) జడేజా బౌలింగ్‌లో 4, 6, 4 బాదడంతో 12 ఓవర్లకు 125/2తో ఆసీస్ ఈజీగా గెలిచేలా కనిపించింది. ఇక్కడి నుంచి ఇండియా బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. 13వ ఓవర్లో అక్షర్ మూడు రన్సే ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో మ్యాక్సీని బౌల్డ్ చేసిన కుల్దీప్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అక్షర్ బౌలింగ్‌లో డేంజర్ మ్యాన్ స్టోయినిస్ (2) పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటవగా.. హెడ్‌ను బుమ్రా వెనక్కు పంపి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్లో మాథ్యూ వేడ్ (1), టిమ్ డేవిడ్ (15) కూడా పెవిలియన్ చేరడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది.
203 ఇంటర్నేషనల్ టీ20ల్లో రోహిత్ కొట్టిన సిక్సర్లు. ఈ ఫార్మాట్‌లో 200 సిక్సర్ల మార్కు దాటిన తొలి క్రికెటర్ రోహిత్. మార్టిన్ గప్టిల్ (173) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఈ ఫార్మాట్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ రోహిత్. బాబర్ ఆజమ్ (4145), విరాట్ కోహ్లీ (4103) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లో 205/5 (రోహిత్ 92, సూర్య 31, స్టార్క్ 2/45, స్టోయినిస్ 2/56)
ఆస్ట్రేలియా : 20 ఓవర్లో 181/7 (హెడ్ 76, మార్ష్ 37, అర్ష్‌దీప్ 3/37, కుల్దీప్ 2/24)