
ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ఆకర్షించే దిశగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 110శాతం నుండి 15శాతానికి తగ్గించనుందని సమాచారం. టెస్లాతో సహా ప్రపంచ తయారీదారులు ఇండియన్ మార్కెట్ వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం 35వేల డాలర్ల కంటే ఎక్కువ ధర గల ప్రీమియం ఈవీలపై దిగుమతి సుంకాలు ప్రస్తుత 110శాతం నుండి 15శాతానికి తగ్గనుంది.
పెట్టుబడి మరియు టర్నోవర్ అర్హతలు:
తగ్గించిన దిగుమతి సుంకం వర్తించాలంటే.. ఆటోమేకర్లు ఇండియాలో కనీసం రూ. 4150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడి నుంచి గత ఖర్చులు, భూసేకరణ, భావన నిర్మాణ ఖర్చులు కూడా మినహాయించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆటోమేకర్స్ రెండవ సంవత్సరం నాటికి రూ. 2500 కోట్ల టర్నోవర్ సాధించాల్సి ఉంటుంది. నాలుగో సంవత్సరం నాటికి రూ. 5000 కోట్లు, ఐదవ సంవత్సరం నాటికి రూ. 7500 కోట్లు టర్నోవర్ సాధించాల్సి ఉంటుంది.
తయారీ, లోకలైజేషన్ టార్గెట్స్:
కొత్త ఈవీ పాలసీ అమల్లోకి వచ్చాక అర్హత గల కంపెనీలు దరఖాస్తులు సమర్పించడానికి 120 రోజుల సమయం ఉంటుంది. అనుమతి సాధించిన తయారీదారులు తగ్గిన సుంకం రేటు ప్రకారం ఏటా 8000 ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే... కొత్త పాలసీ ప్రకారం ఆటోమేకర్స్ మూడేళ్ళ లోపు స్థానికంగా ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని.. 25శాతం మేర దేశీయ మార్కెట్ ను పెంపొందించాల్సి ఉంటుంది. ఐదేళ్ళలో 50శాతం వరకు పెంచాల్సి ఉంటుంది.
టెస్లా ముందుంది:
కొత్త ఈవీ పాలసీ వాళ్ళ లబ్దిపొందే కంపెనీల్లో టెస్లా ముందుంది.. ఏప్రిల్ 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో ప్రవేశించాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 21 - 22 లక్షల ధరతో ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలని.. తొలి షోరూంను ముంబై లేదా ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్లాన్ లో టెస్లా ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మూడవ త్రైమాసికం నాటికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభించే ప్లాన్ లో ఉంది టెస్లా.
టెస్లా బాటలోనే హ్యుండై, వోక్స్ వ్యాగన్:
ఇండియన్ ఈవీ మార్కెట్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న టెస్లా బాటలోనే హ్యుండై, వోక్స్ వ్యాగన్ వంటి ఇతర ఆటోమేకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. పెట్టుబడి వ్యూహాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇండియన్ ఈవీ మార్కెట్ పై ప్రభావం:
కొత్త ఈవీ పాలసీ ద్వారా ఇండియా గ్లోబల్ ప్లేయర్స్ ని ఆకర్షిస్తే.. మన వినియోగదారులకు ప్రీమియం ఈవీలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పాలసీకి జులై, ఆగస్టు నాటికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే ఇండియన్ రోడ్స్ పై ప్రీమియం ఈవీలు చక్కర్లు కొట్టే ఛాన్స్ ఉంది.