ఇండియా కూటమికి.. సీట్ల షేరింగ్ సవాల్..

ఇండియా కూటమికి.. సీట్ల షేరింగ్ సవాల్..
  •     వెస్ట్ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇబ్బందులు
  •     ఒక్కో రాష్ట్రంలో వేర్వేరు రాజకీయ పరిస్థితులు
  •     కేరళలో సీపీఐ(ఎం)తో కాంగ్రెస్​కు విభేదాలు
  •     వెస్ట్ బెంగాల్​లో మాత్రం కూటమిగా ముందుకు

న్యూఢిల్లీ :  ‘ఇండియా’ కూటమి ఇక సీట్ల షేరింగ్​పై దృష్టి పెట్టింది. 28 పార్టీల సభ్యులు లోక్​సభ సీట్ల పంపకాలపై చర్చించుకుని.. ఈ నెల చివరికల్లా తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, సీట్ల షేరింగ్​మాత్రం కూటమికి సవాల్​గా మారింది. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో పరిస్థితి ఉంది. అయినా.. వీలైనంత త్వరగా సీట్ల షేరింగ్ ప్రక్రియ ముగించుకుని.. క్యాంపెయిన్ ప్రారంభించాలనే ఆలోచనలో ఇండియా కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. ప్రతీ లోక్​సభ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున ఒకే అభ్యర్థి బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని పార్టీలు ఒకే అభ్యర్థిని బలపరిస్తే.. బీజేపీని ఓడించడం చాలా సులభం అవుతుందని కూటమి లీడర్లు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఓట్ల చీలిక కూడా ఉండదని ఆలోచిస్తున్నారు. అయితే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూటమిగా ఏర్పడటంలో ఇబ్బందుల్లేకున్నా.. బెంగాల్ లాంటి స్టేట్​లో మాత్రం మళ్లీ విభేదాలు తలెత్తే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్​సీపీ, శివసేన (యూబీటీ) కలిసే ఉన్నాయి. ఇక వెస్ట్ బెంగాల్​లో చూసుకుంటే.. రూలింగ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఓ వైపు ఉంటే.. కాంగ్రెస్, సీపీఎం కలిసి మరోవైపు ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థిని ఎంపిక చేయడం అంత ఈజీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

వెస్ట్​బెంగాల్​లో కలవని కాంగ్రెస్, టీఎంసీ 

వెస్ట్ బెంగాల్​లో కొన్ని రోజుల కింద ధూప్గురి బై ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేస్తే.. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగింది. టీఎంసీ సిట్టింగ్ నియోజకవర్గమైన ధూప్గురిని బీజేపీ అభ్యర్థి నిర్మల్ చంద రాయ్ 4,300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. దేశవ్యాప్తంగా 100 లోక్​సభ స్థానాల్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుంది. వీటిని సీట్ల షేరింగ్​లో కలపరని తెలుస్తున్నది. ఇక మిగిలిన 443 లోక్​సభ స్థానాలను మాత్రం ఇండియా కూటమి పంచుకోవాల్సి ఉంటుంది. వీటిలో జమ్మూ కాశ్మీర్​లోని నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఐదు సీట్ల ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఇక మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్​సభ స్థానాల్లో ఎన్​సీపీ, కాంగ్రెస్, శివసేన (యూ​బీటీ) చెరో 16 సీట్లు పంచుకోవాలని భావిస్తున్నాయి. 

ALSO READ: మళ్లీ హస్తం గూటికి.. నల్లాల ఓదెలు దంపతులు

బీహార్​లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ అయినా...

బీహార్​లో అధికారంలో ఉన్న జేడీ(యూ), ఆర్జేడీ.. 40 లోక్​సభ స్థానాలను కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎలా షేర్ చేయాలన్న దానిపై క్లారిటీ లేదు. స్టేట్​లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ.. లోక్​సభ నుంచి ఎవరూ ప్రాతినిథ్యం వహించడం లేదు. ఢిల్లీలోని ఏడు, పంజాబ్​లోని 13 స్థానాలను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు షేర్ చేసుకోవాల్సి ఉంది. పంజాబ్​లో ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై ఆసక్తి చూడం లేవు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్​లో ఉన్నారు. ఆమె తిరిగి వచ్చాక బెంగాల్​లోని 42 సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోనియా గాంధీ రిక్వెస్ట్ చేస్తే.. కాంగ్రెస్​తో కలిసేందుకు మమతా బెనర్జీ ఒప్పుకునే అవకాశాలు ఉన్నా.. సీపీఐ(ఎం)తో మాత్రం డీల్ కుదరడం కష్టమే అని పలువురు భావిస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం ఉంటే.. బెంగాల్​లో మాత్రం ఈ రెండు కలిసి పని చేస్తున్నాయి.