న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మాల్వేర్ దాడులు మనదేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడయింది. ఈ విషయాన్ని జెడ్‌స్కేలర్ రిపోర్ట్ బయటపెట్టింది. ఈ విషయంలో ఇండియా యునైటెడ్ స్టేట్స్, కెనడాలను దాటింది. దాడుల విషయంలో ఇది వరకు మూడోస్థానంలో ఉండగా, ఇప్పుడు ఒకటో స్థానానికి వచ్చింది.
జెడ్‌స్కేలర్ జూన్ 2023 నుంచి మే 2024 మధ్య 20 బిలియన్లకు పైగా అనుమానిత మొబైల్ లావాదేవీలు, సైబర్ థ్రెట్స్తో కూడిన డేటాను పరిశీలించింది. దాడుల్లో ఇండియా నుంచే 28 శాతం ఉన్నాయి. ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ (27.3 శాతం) కెనడా (15.9 శాతం)ను అధిగమించింది.
కంపెనీల డిజిటలైజేషన్‌కు మారుతున్న సమయంలో వీటి ముప్పు పెరుగుతోంది. మొబైల్ మాల్వేర్ దాడులలో దాదాపు సగం ట్రోజన్‌లు (హానికర సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయించే మాల్వేర్) ఉన్నాయి. వీటితో ఆర్థిక రంగం తీవ్రంగా నష్టపోతోంది. బ్యాంకింగ్ మాల్వేర్ దాడుల్లో 29 శాతం, మొబైల్ స్పైవేర్ దాడులలో 111 శాతం పెరుగుదల నమోదయింది.
బ్యాంకు కస్టమర్లే టార్గెట్
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల వంటి ప్రధాన భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకునే ఫిషింగ్ దాడులు పెరిగాయి. నకిలీ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లను ఉపయోగించడం ద్వారా ఇవి మొబైల్ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. బ్యాంకుల సున్నిత సమాచారాన్ని బయట పెడుతున్నాయి.