మాస్టర్ ప్లాన్లను దాస్తున్నరెందుకు?

భారతదేశంలో పెద్ద గ్రామాలు పట్టణాలు అవుతున్నాయి. పట్టణాలు నగరాలు అవుతున్నాయి. అన్నీ రాజధాని నగరాలు పెరుగుతున్నాయి. కానీ, ఢిల్లీ నుంచి గళ్లీ దాకా ఈ పెరుగుదల చుట్టూ సంక్షోభాలు, సమస్యలు పెరుగుతున్నాయి. క్రమబద్ధ ప్రణాళిక తయారు చేయడం లేదు. అమలు కావడం లేదు. మంచి నీటి వ్యవస్థ, మురుగు నీటి వ్యవస్థలు పూర్తి స్థాయిలో లేవు. చెత్త కుప్పల గుట్టలు పెరుగుతున్నాయి. అనారోగ్య పరిస్థితులు విస్తరిస్తున్నాయి . గాలి, నీరు, ధ్వని కాలుష్యం బారిన పడి ప్రజలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. రోడ్లు సరిపోవడం లేదు. 

నిరుద్యోగం పెరుగుతున్నది. ఆదాయం కొంత, ఖర్చులు అధికం. నేరాలు పెరుగుతున్నాయి. సమస్యలు ముసురుకుంటున్నా, సంక్లిష్టం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పట్టణాల విస్తృతి క్రమబద్ధంగా చేయడానికి మాస్టర్ ప్లాన్ సాధనంగా ఉపయోగించాలని నిర్ణయించింది. ఆ మేరకు ముఖ్యమైన సంస్కరణలతో కూడిన అమృత్ పథకంలో భాగంగా పట్టణాలకు జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఉప పథకం రూపొందించింది. అక్టోబర్ 2015 లో 500 అమృత్ నగరాలకు రూ.515 కోట్లతో 100% కేంద్ర నిధులతో కూడిన ఉప పథకంగా ఆమోదించింది.

ప్రజలకు తెలియకుండా ప్లాన్లు

తెలంగాణలో ప్రభుత్వం ఆమోదిస్తున్న మాస్టర్​ప్లాన్లు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేసినట్టు లేదు. పారదర్శకత పూర్తిగా లోపించింది. పట్టణాలలో ఉన్న సమస్యల మీద ప్రాథమిక సమాచారం ముందుగా సేకరించాల్సి ఉండగా, అదీ చేయలేదు. అసలు ఈ పనుల మీద ప్రజలకు అందుబాటులో ఎలాంటి సమాచారం లేదు. పట్టణ ప్రణాళికలు ప్రజల ఎదుర్కుంటున్న సమస్యల మూల కారణాల ఆధారంగా, మౌలిక వసతుల స్థితిగతుల డేటా ఆధారంగా, ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజలతో సంప్రదింపుల అనంతరం ఆమోదించే ప్రక్రియ అని చట్టం నిర్దేశిస్తున్నా.. అవేవి కార్యరూపం దాల్చలేదు. వరంగల్, నిజామాబాద్ వంటి పెద్ద నగరాల మాస్టర్ ప్లాన్లు కూడా పూర్తి డాక్యుమెంట్ కాకుండా కేవలం ఒక మ్యాపు చూపెట్టి సంప్రదింపుల ప్రక్రియ చేసినట్టు రాసుకుంటున్నారు. 

తయారు చేసిన ప్రణాళికల డాక్యుమెంట్లు, తయారీలో ఉన్న ప్రణాళికలకు సంబందించిన ప్రాథమిక సమాచారం ప్రభుత్వం చూపెట్టడం లేదు. పట్టణ ప్రజల అభివృద్ధి ప్రణాళికల గురించి తెలంగాణ ప్రభుత్వానికి దాపరికం ఎందుకు? వాటిని దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బహుశ, అది ప్రజలకు వ్యతిరేకంగా, కొన్ని వర్గాలకు అనుకూలంగా తయారు చేస్తున్నారు కావొచ్చు. కామారెడ్డి చుట్టూ ప్రక్కల 8 గ్రామాల ప్రజల ముందు పూర్తి సమాచారం పెట్టలేదు. 500 ఎకరాల వ్యవసాయ భూమి పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించిన రైతుల దరఖాస్తులు పట్టించుకోలేదు. ప్రజా వాణిలో వాళ్లు ఎంత మొత్తుకున్నా.. వారి గోడు విని సమాధానం చెప్పే అధికారులే లేకుండా పోయారు. జిల్లా కలెక్టరుకు ఇచ్చిన విన్నపాలతోపాటు ఆఖరుకు ధర్నాలు చేస్తే కానీ ప్రభుత్వం దిగి రాలేదు. అప్పటికి మభ్యపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ల మేరకు రాతపూర్వకంగా వెనక్కి తగ్గలేదు. ఎన్నికల తర్వాత తిరిగి ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉంది. జగిత్యాల పట్టణ ప్రణాళిక విషయంలో కూడా రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
రాజకీయ పార్టీలు మాట్లాడవు!
పట్టణ మున్సిపాలిటిల అభివృద్ధికి15వ ఆర్థిక సంఘం ఇస్తున్న నిధులు అరకొరగా, అనేక షరతుల మధ్య చాలా ఆలస్యంగా విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఆయా పట్టణాల్లో సిబ్బందికి జీతభత్యాలకు, రోజు వారి నిర్వహణకు, అభివృద్ధి పనులకు స్థానికంగా పన్నుల ఆదాయం సరిపోవడం లేదు. ఆదాయం పెంచుకోవడానికి భూమిని అమ్మి సేకరించే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. పట్టణాలకూ అదే జాఢ్యం అంటిస్తున్నది. ఫలితంగా, తెలంగాణలో అన్ని పట్టణాల చుట్టూ ఒక పద్ధతి అనుసరిస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు తయారు చేయటం, పల్లెలను విలీనం చేయటం, భూ వినియోగం మార్చటం, భూమి ధరలు పెంచటం, అభివృద్ధి ఫీజులు వసూలు చేయటం, అవినీతి సామ్రాజ్యానికి ఇంధనం అందించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ భూమి తగ్గిపోయినా, చెరువులు మాయమైనా, గుట్టలు విధ్వంసమైనా, చెట్లు నరికివేసినా ఏ చట్టానికి పట్టింపు లేదు. అనేక జీవనోపాధులు ఈ మాడల్ తో మృగ్యం అవుతున్నాయి. ఇలాంటి పట్టణీకరణ మీద, మ్యాపుల మీద గీసిన మాస్టర్ ప్లాన్ సాధనం మీద, వ్యవసాయ భూమి పరిశ్రమలకు కేటాయించడం మీద, పల్లెలను పట్టణాల్లో విలీనం చేయడం మీద, భూమిని ఒక వ్యాపార వస్తువుగా, పెట్టుబడి దాచుకునే ఆర్థిక సాధనంగా మారుస్తున్న భూ విధానాల మీద రాజకీయ చర్చ లేకపోవడం శోచనీయం. రాజకీయ పార్టీల్లో వీటి మీద ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతుల మీద ఏకాభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ రకమైన అభివృద్ధిలో ప్రధాన లబ్ధిదారులు రాజకీయ నాయకులు కాబట్టి ఆ వర్గం నుంచి వ్యతిరేకత ఉండే అవకాశం తక్కువ. ఆయా పరిస్థితులను బట్టి పార్టీలు, నాయకులు ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో దీని అంశంగా మలిచిన రాజకీయ పార్టీ కానీ, నాయకులు కానీ ఉంటారనుకోవడం అతిశయోక్తేనేమో! మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్న కామారెడ్డి, జగిత్యాల రైతులు ఎన్నికల తర్వాత మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి రావచ్చు.
మాస్టర్ ప్లాన్ వైఫల్యాలు
నగరాల సమతుల్య అభివృద్ధి సాధించడంలో మాస్టర్ ప్లాన్ల పద్ధతి విఫలమైందని అధ్యయనాలు చెబుతున్నాయి. మాస్టర్ ప్లాన్ల అసమర్థతకు కీలకమైన కారణాలు కొన్ని ఉన్నాయి. మాస్టర్ ప్లాన్స్ లో అంతర్లీనంగా ఉన్న బలహీనతలు, ప్రాదేశిక ప్రణాళిక, రంగం లేదా మౌలిక సదుపాయాల ప్రణాళికలు, బడ్జెట్, పెట్టుబడి ప్రణాళిక నిర్ణయాల మధ్య సంబంధం లేకపోవడం, కీలక పట్టణ సంస్థల మధ్య సమన్వయ లోపం, అభివృద్ధి నియంత్రణలు లేకపోవడం లేదా అసమర్థ అమలు, అవాస్తవిక ప్రణాళికా ప్రమాణాలు, నిబంధనలు, అమలుకు పరిమిత సామర్థ్యం, వనరులు కీలక కారణాలుగా చెప్పవచ్చు. వీటిని గుర్తించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ల తయారీ మీద పెట్టిన దృష్టి వాటిని సరి చేయడం మీద పెట్టడం లేదు. నీతి ఆయోగ్ 2021లో ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలోని 7,933 పట్టణ జనావాసాల్లో 65 % మాస్టర్ ప్లాన్ లేదు. సాధారణంగా మాస్టర్ ప్లాన్లు 20- నుంచి 25 ఏండ్ల పాటు భూ వినియోగం, విస్తరణ, నగరాల జోనింగ్ ను నియంత్రిస్తాయి. మాస్టర్ ప్లాన్లను అమలు చేయకపోవడం వల్ల అస్తవ్యస్తమైన నిర్మాణాలు, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, వరదలు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నివేదిక ఒక పథకం సూచించింది. ప్రాదేశిక ప్రణాళిక, ప్రజారోగ్యం, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో సమ్మిళితం ద్వారా ఆరోగ్యం లక్ష్యంగా ప్రణాళిక తయారు చేయడం ఈ పథకం లక్ష్యం. పట్టణ ప్రణాళికలు సరిగ్గా అమలు కావడానికి ఈ నివేదిక ప్రధాన సిఫార్సులు పేర్కొన్నది.  బడ్జెట్ కేటాయింపులు, పౌరుల ఆకాంక్షల ఆధారంగా వివిధ రంగాలకు ప్రణాళికలు రూపొందించడం, ఈ పనికి రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించడం,  మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలు, జిల్లా ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేయడం, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీని ప్రోత్సహించడానికి 500 నగరాలకు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పరిధిని పెంచడం. పట్టణ పౌరాలను అడగడం, సంప్రదింపులు జరపడం వంటి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచించలేదు. కమిటీల ఏర్పాటును కూడా అవి విస్మరించాయి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రాంతీయ ప్రణాళిక రూపొందిస్తే సుఖమైన, ఆరోగ్యకరమైన నగర జీవితం సాధ్యం అవుతుంది. కేవలం భూమి ధరలు పెంచడానికి, ఆకాశహర్మ్యాలు నిర్మించడానికి, వేగంగా పయనించే కార్ల కోసం రోడ్లను వెడల్పు చేయడానికి పట్టణ ప్రణాళికలు తయారు చేయడం వల్ల అనేక ఇతర కొత్త సమస్యలు పట్టణాలలో ఉద్భవిస్తున్నాయి. పట్టణాలు ప్రకృతి వనరుల భక్షణ కేంద్రాలుగా మిగిలిపోవటానికి ప్రధాన కారణం లోపభూయిష్ట మాస్టర్ ప్రణాళికలే 
కారణం.
రాష్ట్రంలో వివిధ పట్టణాల్లో మాస్టర్​ ప్లాన్ల తీరు..
461 అమృత్ నగరాల్లో తుది జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ల తయారీ152 నగరాలకు ఆమోదిస్తే, మాస్టర్ ప్లాన్ల ముసాయిదా కేవలం132 నగరాలకే పూర్తయింది. అమృత్ 2.0 కింద జీఐఎస్ ఆధారిత ఉప పథకం 50,000-99,999 జనాభా ఉన్న క్లాస్- 2(ద్వితీయ శ్రేణి) పట్టణాల మాస్టర్ ప్లాన్ల తయారీకి మొత్తం 675 పట్టణాలకు రూ.631 కోట్ల నిధులను ఆమోదించింది. ఇందులో సాధించిన ప్రగతి గురించిన సమాచారం లేదు. అయితే, తెలంగాణాలో గుర్తించిన141 పట్టణ కేంద్రాల్లో అనేకం ఈ పథకంలో ఉన్నాయి. దీన్నే ‘తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి’ ప్రాజెక్టుగా నామకరణం చేసి తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ 20 పట్టణ కేంద్రాల మాస్టర్ ప్లాన్లను సవరించే పనికి పూనుకున్నది. ఇప్పటికే, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల పట్టణ ప్రణాళికలను ఆమోదించింది. పెద్దపల్లి పట్టణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసే పని ఉంది. భూపాలపల్లి, దేవరకొండ, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఆందోల్, జోగిపేట్ ముసాయిదా ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉన్నది. కొత్తగా ప్రకటించిన 54 పట్టణాల మాస్టర్ ప్లాన్లు జూన్, 2023 నాటికి పూర్తి అవుతాయని అంచనా వేశారు. కానీ వాటి ప్రస్తుత పరిస్థితి ఆశించిన స్థాయిలో ముందుకు కదలలేదు. 
- దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్