మెల్‌బోర్న్ : బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పింక్ టెస్టులో బోల్తా కొట్టి మూడో మ్యాచ్‌లో వాన అండతో ఓటమి తప్పించుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్‌లో ఎలాగైనా ముందంజ వేయాలని చూస్తోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం అనివార్యం అయిన నేపథ్యంలో ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే బాక్సింగ్ డే టెస్టు కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ కోసం తమకు కేటాయించిన పిచ్‌ల నాణ్యతపై టీమిండియా అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైట్ బాల్ ప్రాక్టీస్‌కు ఉపయోగించిన వికెట్లపై వరుసగా రెండు రోజుల ప్రాక్టీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి, ఓపెనర్ కేఎల్ రాహుల్, పేసర్ ఆకాశ్ దీప్ చేతికి బంతులు తగిలాయి. వీరిలో రోహిత్‌కు దెబ్బ కాస్త గట్టిగానే తగిలింది. ఆదివారం సపోర్ట్ స్టాఫ్ మెంబర్ దయానంద్ గరాణి విసిరిన ఓ త్రో డౌన్ బలంగా తగలడంతో రోహిత్ మోకాలికి గాయమైంది. దాంతో తను మళ్లీ నెట్స్‌లోకి రాలేదు. నొప్పి నుంచి రిలీఫ్ కోసం ఐస్‌ప్యాక్ పెట్టుకున్నాడు. పిచ్‌పై అనూహ్యమైన బౌన్స్ కారణంగానే రోహిత్‌కు గాయం అయినట్టు తెలుస్తోంది. రాహుల్, ఆకాశ్ దీప్ చేతులకు కూడా ఇలానే దెబ్బలు తగిలాయి.
ఎంసీజీ గ్రౌండ్‌లో తమ ట్రెయినింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను టీమిండియా రెండు నెలల ముందుగానే పంపించింది. కానీ, ఎంసీజీ క్యూరేటర్ మాట్ పేజ్ ఎంసీజీ మెయిన్ వికెట్‌కు ఏమాత్రం పోలిక పాత ప్రాక్టీస్ పిచ్‌లను ఇండియాకు కేటాయించాడు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం టెస్టు మ్యాచ్ ఆరంభానికి మూడు రోజులు ముందు మాత్రమే కొత్త ప్రాక్టీస్ ట్రాక్ ఇవ్వాలన్న ప్రొటోకాల్‌ను పాటించానని చెబుతున్నాడు.
‘నిబంధనల ప్రకారం మ్యాచ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే కొత్త పిచ్‌ను ప్రిపేర్ చేస్తాం. అంతకంటే ముందుగా జట్టు ప్రాక్టీస్ చేయడానికి వస్తే మా వద్ద ఉన్న పిచ్‌లనే ఇస్తాం. ఈ రోజు (సోమవారం) ఫ్రెష్ పిచ్‌లు అందుబాటులోకి వచ్చాయి’ అని పేజ్ పేర్కొన్నాడు. కాగా, వరుసగా రెండు రోజులు ముమ్మరంగా సాధన చేసిన టీమిండియా సోమవారం ప్రాక్టీస్‌కు సెలవు ఇచ్చింది.
ఎంసీజీ పిచ్ పేసర్లదే
ప్రతిష్టాత్మక ఎంసీజీ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనుంది. పెర్త్ మాదిరి బౌన్స్, గబ్బా లాంటి సీమ్ మూవ్‌మెంట్ లభించకపోయినా 6 మి.మీ పచ్చికతో కూడిన ఈ వికెట్ పేసర్లకు సపోర్ట్ ఇవ్వనుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌పై పగుళ్లు వచ్చే ఆస్కారం లేదని క్యూరేటర్ పేజ్ చెప్పాడు. దాంతో స్పిన్నర్లకు ఎలాంటి సహకారం ఉండబోదన్నాడు. వికెట్‌పై పచ్చిక ఉన్నప్పటికీ బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుందని చెప్పాడు.
అశ్విన్ ప్లేస్‌లో తనుష్ కోటియన్
ఈ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల కోసం ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్‌ను ఇండియా జట్టులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో అతను టీమ్‌లోకి వచ్చాడు. 26 ఏండ్ల తనుష్ ఇటీవల ఇండియా–ఎ తరఫున ఆస్ట్రేలియా టూర్‌కు వచ్చాడు. జడేజా, సుందర్‌కు బ్యాకప్‌గా తనుష్‌ను జట్టులో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ కోసం అహ్మదాబాద్‌లో ఉన్న కోటియన్ మంగళవారం ముంబై నుంచి బయల్దేరి నాలుగో టెస్టు ఆరంభానికి ముందు మెల్‌బోర్న్‌లో జట్టుతో కలవనున్నాడు.
ఇండియా–ఎ టూర్ సందర్భంగా మెల్‌బోర్న్‌లో అతను ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 44 రన్స్ సాధించాడు. ఇప్పటిదాకా 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనుష్101 వికెట్లు పడగొట్టి.. రెండు సెంచరీలు సహా 1525 రన్స్ చేశాడు. కాగా, అశ్విన్ స్థానంలో ముందుగా అక్షర్ పటేల్‌ను చివరి రెండు టెస్టులకు తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు. కానీ, విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల తర్వాత కుటుంబ పనుల నిమిత్తం అక్షర్ బ్రేక్ తీసుకుంటానని ముందే సమాచారం ఇచ్చాడు. దాంతో అనూహ్యంగా తనుష్ కోటియన్‌కు చాన్స్ లభించింది.