
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సూచనా నిబంధనలను (టర్మ్స్ఆఫ్ రెఫరెన్స్) ఖరారు చేశామని అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 19 అధ్యాయాలు ఉంటాయని పేర్కొన్నారు. వీటిలో సుంకాలు, వస్తువులు, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ వంటి అంశాలు ఉంటాయి. టారిఫ్ల అమలుకు అమెరికా ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఈలోపు పరిష్కరించడానికి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు ఈ చర్చలు జరగనున్నాయి.
భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. ఆయనను ఈ నెల 18న తదుపరి వాణిజ్య కార్యదర్శిగా నియమించారు. వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య చర్చలు వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తాయని, ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. వాణిజ్య ఒప్పందం ఖరారైతే, రెండు దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయి. పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు.
వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి , పెట్టుబడులను పెంచడానికి అవసరమైన నిబంధనలను కూడా సరళీకరిస్తాయి. కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్), వైన్‌లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఆపిల్స్, ట్రీ నట్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాలలో సుంకాలపై రాయితీలను యూఎస్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. దుస్తులు, వస్త్రాలు, రత్నాలు ఆభరణాలు, తోలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, నూనె గింజలు, రొయ్యలు, ఉద్యాన ఉత్పత్తులపై టారిఫ్లను తగ్గించాలని ఇండియా కోరుకుంటోంది. 2021–-22 నుంచి 2024–-25 వరకు యూఎస్ భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.