న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు తాను క్వాలిఫై అవ్వడం కష్టమైన విషయమని ఇండియా వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పింది. అయితే, ఇప్పట్లో ఆటకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. మోకాలి గాయం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆటలో వెనకబడిన 33 ఏండ్ల సైనా పలు టోర్నీలకు దూరంగా ఉంటోంది. దాంతో మాజీ వరల్డ్ నం.1 అయిన నెహ్వాల్ ఇప్పుడు 55వ ర్యాంక్‌కు పడిపోయింది.
‘ఇప్పుడు నేను గంట, రెండు గంటలు ట్రెయినింగ్‌లో పాల్గొంటే నా మోకాలిలో మంట వస్తోంది. దాంతో మరో సెషన్ ప్రాక్టీస్ సాధ్యం కావడం లేదు. నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. మరోవైపు ఒలింపిక్స్ సమీపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేను క్వాలిఫై అవ్వడం చాలా కష్టం’ అని సైనా తెలిపింది. అందరూ ఏదో రోజు ఆటకు వీడ్కోలు చెప్పాల్సిందేనన్న సైనా తన రిటైర్మెంట్‌కు డెడ్‌లైన్ ఏమీ పెట్టుకోలేదని తెలిపింది.