- ఆరు వికెట్లతో చెలరేగిన బుమ్రా
- ఒకటిన్నర రోజుల్లోనే సఫారీలు ఖతం
- తక్కువ బాల్స్‌లో ముగిసిన టెస్ట్‌గా రికార్డు
కేప్‌టౌన్‌లో టీమిండియా కేక పుట్టించింది. సెంచూరియన్ తొలి టెస్టులో రెండున్నర రోజుల్లోనే తమను ఓడించిన సౌతాఫ్రికాపై ఓ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుంది. మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా పేస్ పవర్ చూపెట్టిన వేళ ఒకటిన్నర రోజుల్లోనే రెండో టెస్టును ముగించింది. టెస్టు క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ మ్యాచ్‌గా నిలిచిన ఈ పోరులో ఐదు సెషన్లలోనే ఆతిథ్య జట్టు పని పట్టి ఔరా అనిపించింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విక్టరీ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలినా కేప్‌టౌన్‌లో తొలి విజయంతో 1-1తో ఈ సిరీస్‌ను డ్రా చేసుకుంది. దాంతో రెయిన్‌బో నేషన్‌లో సిరీస్‌ను డ్రా చేసిన ఇండియా రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ లెజెండ్ ఎంఎస్ ధోనీ (2010-11) సరసన నిలిచాడు.
కేప్‌టౌన్ : తొలి రోజు మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఖతర్నాక్ బౌలింగ్ చూపెడితే రెండో రోజు పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/61) కూడా బుల్లెట్లలాంటి బాల్స్‌తో సిక్సర్ కొట్టాడు. దాంతో ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా హిస్టారికల్ విక్టరీ సొంతం చేసుకుంది. సిరీస్‌ను 1–1తో పంచుకుంది. బుధవారం మొదలై గురువారమే ముగిసిన ఈ టెస్ట్‌లో బుమ్రా దెబ్బకు సఫారీ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 36.5 ఓవర్లలోనే 176 రన్స్‌కు ఆలౌటైంది.
ఐడెన్ మార్‌క్రమ్ (103 బాల్స్‌లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో106) ఒంటరి పోరాటం చేసినా ఇండియా ముందు 79 రన్స్ టార్గెట్‌ను మాత్రమే ఉంచింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (28) మెరుపులతో ఇండియా 12 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55, ఇండియా 153 రన్స్ చేశాయి. మొదటి ఇన్నింగ్స్‌లో కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించగా.. చివరి టెస్టు ఆడిన డీన్ ఎల్గర్, బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును పంచుకున్నారు.
ఈసారి బుమ్రా
తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ హోమ్ టీమ్‌ను దెబ్బకొడితే ఈసారి ఆ బాధ్యతను బుమ్రా తీసుకున్నాడు. మార్నింగ్ స్పెల్‌లో ఫుల్ లెంగ్త్ డెలివరీలతో సఫారీ బ్యాటర్లను వణికించాడు. ఓవర్‌నైట్ స్కోరు 62/3తో హోమ్ టీమ్ ఆట కొనసాగించగా.. ఆరో బాల్‌కే బెడింగ్ హామ్ (11)ను ఔట్ చేశాడు. ఆపై, అనవసర పుల్ షాట్‌కు ప్రయత్నించిన వెరైన్ (9) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే మార్కో జాన్సెన్ (11)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చగా.. ఓ ఫుల్ లెంగ్త్ బాల్‌కు కేశవ్ (3) గల్లీలో అయ్యర్‌కు చిక్కడంతో బుమ్రా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
దాంతో సఫారీ టీమ్ 111/7తో నిలిచింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన మార్‌క్రమ్.. ప్రసిధ్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో విజృంభించాడు. బుమ్రా ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రబాడ (2)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేసిన మార్‌క్రమ్ చివరకు సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆవెంటనే రబాడను ప్రసిధ్ పెవిలియన్ చేర్చగా.. ఎంగిడి (8)వికెట్ తీసిన బుమ్రా సఫారీ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆపై చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్ యశస్వి ఉన్నంతసేపు దంచికొట్టాడు. రోహిత్ (16 నాటౌట్)తో తొలి వికెట్‌కు 44 రన్స్ జోడించి ఛేజింగ్‌ను వన్‌సైడ్ చేశాడు. యశస్వి, గిల్ (10), కోహ్లీ (12) ఔటైనా.. అయ్యర్ (4 నాటౌట్)తో కలిసి రోహిత్ లాంఛనం పూర్తి చేశాడు.
మా బెస్ట్ విక్టరీల్లో ఒకటి : రోహిత్
ఇది మా అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్ విజయాల్లో ఒకటి. ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్ ఎలా ఉందో అందరం చూశాం. ఇండియాలోనూ పిచ్‌లు ఇలానే స్పందించినప్పుడు అంతా నోరు మూసుకుని ఉన్నంత కాలం ఇలాంటి వికెట్లపై ఆడేందుకు నాకు అభ్యంతరం లేదు. ఈ వికెట్ నిజంగానే ప్రమాదకరంగా ఉంది. సవాల్ విసిరింది. వాళ్లు (ఫారిన్ టీమ్స్) ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సవాలే ఎదురవుతుంది. కాబట్టి పిచ్ రేటింగ్ విషయంలో మ్యాచ్ రిఫరీలు న్యూట్రల్‌గా ఉండటం ముఖ్యం. వాళ్లు పిచ్‌ను చూసి రేటింగ్ ఇవ్వాలి. అంతేతప్ప ఆతిథ్య దేశాన్ని
చూసి ఇవ్వకూడదు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; ఇండియా తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 36.5 ఓవర్లో 176 ఆలౌట్(మార్‌క్రమ్ 106, బుమ్రా6/61, ముకేశ్ 2/56).
ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 79):12 ఓవర్లలో 80/3 (యశస్వి 28, రోహిత్ 16*, జాన్సెన్ 1/15).
642 బాల్స్ పరంగా అతి తక్కువ సమయంలో ముగిసిన టెస్టు ఇది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 642 (107 ఓవర్లు) బాల్స్ పడ్డాయి. దాంతో 1932లో మెల్‌బోర్న్‌లో 656 బాల్స్‌లోనే ముగిసిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ రికార్డు బ్రేక్ అయింది.
25 టెస్టు క్రికెట్ హిస్టరీలో రెండు రోజుల్లోనే ముగిసిన 25వ మ్యాచ్ ఇది.
3 ఇండియా ఓ టెస్టును రెండు రోజుల్లోనే ముగించడం ఇది మూడోసారి. 2018లో అఫ్గానిస్తాన్ (బెంగళూరు)పై, 2021లో ఇంగ్లండ్ (అహ్మదాబాద్)పై గెలిచింది.
464 ఈ మ్యాచ్‌లో మొత్తం రన్స్. సౌతాఫ్రికా–ఇండియా మధ్య పూర్తయిన టెస్టులో ఇవే అత్యల్పం. 2015లో నాగ్‌పూర్‌లో 652 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.