టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నేడు(జూన్ 20) అసలు పరీక్ష ఎదురు కానుంది. సూపర్ 8 తొలి పోరులో కెన్సింగ్టన్ ఓవల్(బార్బడోస్) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలాగోలా గట్టెక్కిన రోహిత్ సేన.. ఈ కీలక మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆట ఆడాల్సింది. ఏమాత్రం అలసత్వం వహించినా.. ఆఫ్ఘన్లు దెబ్బకొట్టగలరు. అందునా, ఈ మ్యాచ్‌లో గెలిచి గత ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆఫ్ఘన్ ఫ్యాన్స్.. రోహిత్ సేనకు హెచ్చరికలు పంపుతున్నారు.
పసికూన కాదు.. జాగ్రత్త!
గత నాలుగైదేళ్లలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించింది. ఆ జట్టులో ఆరేడుగురు ప్లేయర్లు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ మంచి అనుభవాన్ని గడించారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడమే కాదు.. ఒత్తిడిలోనూ రాణించగలిగేలా నైపుణ్యాన్ని గడించారు. రహ్మనుల్లా గుర్భాజ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి మ్యాచ్ విన్నర్లు వారి సొంతం. కావున ఆఫ్ఘన్ జట్టును తేలిగ్గా తీసిపారేసే అవకాశాలు లేనే లేవు. అందునా, స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్‌లపై ఆఫ్ఘన్ ద్వయం రషీద్, నూర్ మరింత ప్రమాదకరం. దీంతో ఆఫ్ఘన్ ఫ్యాన్స్ భారత్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బ్యాటర్లపైనే భారత్ ఆశలు
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నుంచి బయటపడాలని టీమిండియా కోరుకుంటోంది. రోహిత్, కోహ్లీతో పాటు సూర్య, పంత్ బ్యాట్ ఝుళిపిస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు, వేదికలు అమెరికా నుంచి వెస్టిండీస్ కు మారడంతో.. కీలక మ్యాచ్‌లో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైన మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ తుది జట్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇరు జట్ల రికార్డులు
టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ సేన పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. మెన్ ఇన్ బ్లూ(టీమిండియా) ఏడింటిలో విజయం సాధించింది. మరొకటి రద్దయ్యింది. ఇక టీ20 ప్రపంచకప్‌లలో ఈ రెండూ మూడుసార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజేత.
- ఆడిన మ్యాచ్‌లు: 8
- భారత్: 7
- ఆఫ్ఘనిస్తాన్: 0
- రద్దయినది: 1
భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు(అంచనా): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ.