- సిరీస్ పట్టేస్తారా?
- నేడు ఆస్ట్రేలియాతో ఇండియా నాలుగో టీ20
- బౌలింగ్‌పై టీమిండియా దృష్టి
- లెక్క సరిచేసేందుకు కంగారూల ప్రయత్నం
- రా. 7 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో
రాయ్‌పూర్: ఆస్ట్రేలియాతో షార్ట్ ఫార్మాట్‌లో సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు టీమిండియా రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2–1 లీడ్‌లో ఉంది. అయితే బౌలింగ్ ఫెయిల్యూర్స్‌తో మూడో టీ20లో ఓడిన ఇండియా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను పట్టేయాలని టార్గెట్‌గా పెట్టుకుంటే.. లెక్క సరి చేయాలని కంగారూలు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లకు మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. డెత్ ఓవర్స్ బౌలింగ్ పర్ఫెక్షన్ కోసం ఇండియా ఈ మ్యాచ్‌లో బౌలర్లను మార్చే చాన్స్ ఉంది.
గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో 68 రన్స్ ఇచ్చిన ప్రసిధ్‌పై వేటు వేయనున్నారు. కొత్తగా టీమ్‌లోకి వచ్చిన దీపక్ చహర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇస్తారో లేదో చూడాలి. గత మ్యాచ్‌కు దూరమైన ముకేశ్ కుమార్ రాకతో బౌలింగ్ బలం పెరిగింది. అవేశ్ ఖాన్‌ను కంటిన్యూ చేస్తే, అర్ష్‌దీప్, చహర్‌లో ఒకరికే చాన్స్ ఉంటుంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌తో పాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. బ్యాటింగ్‌లో భారీ మార్పులు కనిపించడం లేదు. స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వస్తే తెలుగు బ్యాటర్ తిలక్ వర్మకు చాన్స్ దక్కకపోవచ్చు. మిగతా లైనప్‌లో యశస్వి, రుతురాజ్ ఓపెనింగ్ చేయనున్నారు. ఇషాన్, సూర్య కుమార్ మెరిస్తే మరోసారి భారీ స్కోరు ఖాయం. ఫినిషర్‌గా రింకూ సింగ్‌పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో ఇబ్బందుల్లేకపోయినా ఈ మ్యాచ్‌లో నెగ్గాలంటే బౌలర్లు శక్తికి మించి శ్రమించాలి.
క్రిస్ గ్రీన్‌కు చాన్స్..
వర్క్‌లోడ్‌లో భాగంగా మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, ఆడమ్ జంపా, స్మిత్, ఇంగ్లిస్‌ను తప్పించిన ఆస్ట్రేలియా యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్‌కు తొలి మ్యాచ్ ఆడే చాన్స్ దక్కొచ్చు. జోస్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, బెన్ డ్వారిషస్‌లను కూడా తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్‌లో ఆరోన్ హ్యార్డీ, హెడ్ శుభారంభం ఇస్తే ఆసీస్‌కు తిరుగుండదు. అయితే సీనియర్లు లేకపోవడంతో మిడిలార్డర్ బాధ్యతలు మొత్తం షార్ట్, టిమ్ డేవిడ్, వేడ్‌పైనే ఉన్నాయి. చివర్లో మెక్‌డెర్మాట్ బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో నేథన్, బెరెన్‌డార్ఫ్‌తో పాటు స్పిన్నర్‌గా సంగా కీలకం కానున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను ఐదో టీ20 వరకు తీసుకెళ్లాలని కంగారూలు పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
జట్లు (అంచనా):
ఇండియా: సూర్య కుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్, ఇషాన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ / దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ / అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హ్యార్డీ, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, బెన్ మెక్‌డెర్మాట్, టిమ్ డేవిడ్, క్రిస్ గ్రీన్, బెన్ డ్వారిషస్, నేథన్ ఎలిస్, బెరెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా.