- 10 వికెట్లతో ఓడిన ఇండియా
- రెండో ఇన్నింగ్స్‌లో 175 రన్స్‌కే ఆలౌట్
- డబ్ల్యూటీసీలో టీమిండియాను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు ఆసీస్
బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్ (డేనైట్)లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసిస్ 1-1తో సమం చేసింది..
అడిలైడ్: బ్యాటింగ్, బౌలింగ్‌లో ఘోరంగా ఫెయిలైన ఇండియా.. పింక్ టెస్ట్ (డేనైట్)లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. కంగారూల బౌలింగ్‌కు ఎదురు నిలువలేక రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను అప్పగించేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42) మరోసారి ఒంటరిపోరాటం చేసినా రెండో ఎండ్‌లో మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. మూడో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 1–1తో సమం చేసింది.
128/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 36.5 ఓవర్లలో 175 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని కంగారూలు 3.2 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్లు నేథన్ మెక్‌స్వీని (10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (9 నాటౌట్) ఈజీగా విజయాన్ని అందించారు. ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 60.71 పీటీసీతో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. ఇండియా (57.29) ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శనివారం నుంచి బ్రిస్బేన్‌లో జరుగుతుంది.
కమిన్స్ దెబ్బ..
తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ దెబ్బకు కుదేలైన ఇండియాను రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ (5/57) బెంబేలెత్తించాడు. షార్ట్ బాల్స్‌తో ఇండియా లైనప్‌ను కూల్చేశాడు. రెండో ఎండ్‌లో బోలాండ్ (3/51) కూడా మంచి సహకారం అందించాడు. దీంతో ఇండియా12.5 ఓవర్లలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట మొదలైన తొలి ఓవర్‌లోనే స్టార్క్ (2/60) వేసిన పుల్ లెంగ్త్ బాల్‌ను డిఫెండ్ చేయబోయిన ఓవర్‌నైట్ బ్యాటర్ రిషబ్ పంత్ (28) సెకండ్ స్లిప్‌లో స్మిత్‌కు చిక్కాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న నితీశ్... ఆసీస్ బౌలింగ్‌ను మరోసారి దీటుగా ఎదుర్కొన్నాడు.
మంచి టెక్నిక్‌తో పేస్ బౌలింగ్‌ను ఎటాక్ చేసిన అతను ఇండియాను ఇన్నింగ్స్ ఓటమి నుంచి రక్షించాడు. రెండో ఎండ్‌లో కమిన్స్ షార్ట్ బాల్‌ను హుక్ చేయబోయి అశ్విన్ (7) కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే కమిన్స్ ఓ షార్ట్ బౌన్స్‌తో హర్షిత్ రాణా (0)ను పెవిలియన్‌కు పంపాడు. తన తర్వాతి ఓవర్‌లో యాంగిల్ వైడ్ బౌన్సర్‌తో నితీశ్‌ను ఔట్ చేసి ఐదో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో బోలాండ్ దెబ్బకు సిరాజ్ (7) వికెట్ ఇచ్చుకోవడంతో ఇండియా ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 180 ఆలౌట్. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 337 ఆలౌట్. ఇండియా రెండో ఇన్నింగ్స్: 36.5 ఓవర్లలో 175 ఆలౌట్ (నితీశ్ రెడ్డి 42, కమిన్స్ 5/57).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 19): 3.2 ఓవర్లలో 19/0 (మెక్‌స్వీని 10*, ఖవాజా 9*).
12/13
పింక్ బాల్‌తో ఆడిన 13 టెస్టు మ్యాచ్‌ల్లో 12 విజయాలతో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది.
1031
ఈ మ్యాచ్ 1031 బాల్స్‌లోనే ముగిసింది. బాల్స్ పరంగా ఇండియా, ఆసీస్ మధ్య జరిగిన అతి చిన్న మ్యాచ్ గా నిలిచింది.