IND vs AUS: ముగిసిన రెండోరోజు ఆట.. ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆశలు

IND vs AUS: ముగిసిన రెండోరోజు ఆట.. ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆశలు

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా.. భారత బ్యాటర్లను తక్కువ స్కోరుకు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (4*), రిషభ్‌ పంత్ (6*) ఉన్నారు. ఇంకా టీమిండియా 310 పరుగుల వెనుకంజలో ఉంది. 

మారని రోహిత్ ఆట

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(3) ఎలాంటి మార్పు లేదు. ఎప్పటిలానే క్రీజులో నిలదొక్కుకోవడానికే తడబడ్డాడు. అనవరసపు షాట్‌తో వికెట్ పారేసుకుని పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (82) జట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్ (24), విరాట్ కోహ్లీ (36)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. బోలాండ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అనంతరం నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (0) పరుగులేమీ చేయకుండానే ఔటవ్వడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది. క్రీజులో రవీంద్ర జడేజా (4*), రిషభ్‌ పంత్ (6*) చివరలో ఆచి తూచి ఆడారు. ఈ జోడి మంచి భాగస్వామ్యాన్ని నెలకొపితే.. టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కినట్లే. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌, కమిన్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్మిత్ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోర్

అతకుముందు  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. మార్నస్ లబుషేన్ (72), సామ్ కొంటాస్(60), ఉస్మాన్ ఖవాజా (57) హాఫ్ సెంచరీలు చేశారు. లోయర్ ఆర్డర్ లో పాట్ కమిన్స్ (49) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.