- బ్యాకప్‌గా దేవదుత్ పడిక్కల్
- నితీశ్‌కు అరంగేట్రం చాన్స్ దక్కేనా?
పెర్త్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. మోచేతి గాయానికి గురైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడు. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. బౌలర్లందర్ని ఈజీగా ఎదుర్కొన్నాడు. దీంతో రాహుల్ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. ఫలితంగా ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా మెరుగయ్యాయి. మూడు గంటల పాటు జరిగిన నెట్ సెషన్‌లో రాహుల్ అన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు. ‘తొలి రోజు నాకు గాయమైంది. కానీ ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశా. తొలి టెస్ట్‌కు రెడీగా ఉన్నా. నేను ముందుగానే ఇక్కడికి వచ్చి పరిస్థితులకు అలవాటు పడినందుకు సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌కు రెడీ కావడానికి నాకు చాలా టైమ్ దొరికింది’ అని రాహుల్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రాహుల్ చికిత్సకు బాగా స్పందించాడని టీమ్ ఫిజియో కమ్లేష్ జైన్ వెల్లడించాడు. మోచేతి ఎముకలో ఎలాంటి పగులు లేదన్నాడు. ఇక నొప్పి తగ్గించడానికే చికిత్స చేశామని అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ తెలిపాడు.
వేలి గాయంతో గిల్ తొలి టెస్ట్‌కు దూరం కాగా, రెండోసారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ మరికొంత సమయం ఫ్యామిలీతో గడిపేందుకు ఇండియాలోనే ఉండిపోయాడు. రెండో టెస్ట్‌కు అతను జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రాహుల్‌ను ఆడించే చాన్స్ ఉంది. రోహిత్ గైర్హాజరీతో బుమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నారు.
పడిక్కల్‌తో పాటు ముగ్గురు పేసర్లు..
టీమిండియా టాప్ ఆర్డర్‌లో ఇబ్బందులు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా దేవదుత్ పడిక్కల్‌ను బ్యాకప్‌గా తీసుకున్నారు. అతనితో పాటు ఇండియా–ఎకు ఆడిన ముగ్గురు పేసర్లు ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్ సైనీని ఆసీస్‌లోనే ఉంచారు. ఇండియా–ఎ తరఫున పడిక్కల్ 36, 88, 26, 1 రన్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఇండియా–ఎ జట్టు ఆదివారం ఆసీస్ నుంచి ఇండియాకు బయలుదేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ధర్మశాలతో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్ నాలుగో నంబర్‌లో దిగి 65 రన్స్ చేశాడు.
నితీశ్ రెడ్డి X హర్షిత్ రాణా
తొలి టెస్ట్‌కు టైమ్ తక్కువగా ఉండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టుపై కసరత్తు మొదలుపెట్టింది. కొంత మంది ప్లేయర్లు చిన్నచిన్న గాయాలతో ఇబ్బందిపడుతుండటంతో ఫైనల్ ఎలెవన్ ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్లాట్ కోసం తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతానికి నితీశ్‌కు అరంగేట్రం చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఆసీస్–ఎతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 0, 17, 16, 38 రన్స్ చేయడంతో పాటు ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇది కాస్త మైనస్‌గా కనిపిస్తోంది. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా నిరూపించుకున్నప్పటికి రాణా టీమిండియా డెబ్యూ కోసం చాలా శ్రమిస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన అతను టెస్ట్‌లకు రెడీగా ఉన్నట్లు సంకేతాలిచ్చాడు. ఆడిన రెండు మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు 0, 12, 31, 24 రన్స్ చేయడం ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. రంజ్లీలోనూ హర్షిత్ రాణించడం కలిసొచ్చే అంశం.