టీ20 వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సూపర్ 8 లో భాగంగా సోమవారం (జూన్ 24) ఆస్ట్రేలియాతో భారత్ ఢీ కొట్టనుంది. గ్రాస్ ఐలెట్ లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది. సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలిచి తీరాలి. మరో వైపు భారత్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా భారత్ కు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోతే మాత్రం లెక్కలు మారిపోతాయి.
ఆస్ట్రేలియాకు ఒక్క రోజే గ్యాప్:
సూపర్ 8 లో భాగంగా ఆదివారం (జూన్ 23) ఉదయం ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా.. సోమవారం సాయంత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దీంతో ఉన్న ఒక్క రోజు వారు రెస్ట్ తీసుకోవడంతోనే సరిపోతుంది. రెండు, మూడు గంటలు ప్రాక్టీస్ తప్పితే ఆసీస్ కు పెద్దగా సమయం ఉండదు. ఇదే కంగారూల జట్టుకు మైనస్ గా మారింది. దీంతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొని నిలబడడం ఆసీస్ కు పెద్ద సవాలుగా మారింది. ఆసీస్ తుది జట్టులో స్టార్క్ వచ్చే అవకాశం ఉంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను ఆసీస్ ను ఓడించిన తర్వాత భారత్ మరోసారి ఐసీసీ టోర్నీలో ఆసీస్ తో తలపడబోతుంది.
ప్రతీకారం కోసం భారత్:
బంగ్లాదేశ్‌పై ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఇండియా ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది. టోర్నీలో ముందుకొస్తే కంగారూ టీమ్‌తో సవాల్ తప్పదు కాబట్టి సూపర్8 లోనే దాన్ని ఇంటికి పంపించాలని ఇండియా చూస్తోంది. పైగా, డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తమకు గుండెకోత మిగిల్చిన ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని రోహిత్‌సేన భావిస్తోంది.
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా:
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్/ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
భారత్ తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.