టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా డేంజర్ జోన్ లో పడింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అజేయంగా ఉన్న ఆసీస్ కు ఆఫ్ఘనిస్తాన్ అనూహ్య షాక్ ఇచ్చింది. దీంతో సూపర్ 8 లో భాగంగా సోమవారం (జూన్ 24) భారత్ పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్ రేస్ లో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం సెమీస్ రేస్ నుంచి దాదాపు తప్పుకుంటుంది. జోరు మీదున్న టీమిండియాను అడ్డుకోవాలంటే కంగారూల జట్టుకు శక్తికి మించిన పని. టీమిండియాను ఎలాగైనా ఈ మ్యాచ్ లో ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే వారికి వర్షం రూపంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది.
గ్రాస్ ఐలెట్ లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో వర్షం ముప్పు పొంచి ఉందని వాతావారణ నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ సూచన ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ముందు వర్షం కురుస్తుందని అంచనా వేయబడింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. విండీస్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ 10 గంటలకు జరగనుంది. మ్యాచ్ మధ్యలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
మ్యాచ్ రద్దయితే..?
ఈ మ్యాచ్ రద్దయితే టీమిండియా 5 పాయింట్లతో పట్టికలో టాప్ లో నిలిచి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా 3 పాయింట్లతో సెమీస్ రేస్ లో ఉంటుంది. మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై మరో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్ చేరుకుంటుంది. ఈ గ్రూప్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ చెరో మ్యాచ్ గెలిచాయి.
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా:
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్/ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
భారత్ తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా