చెన్నై: బంగ్లాదేశ్, టీమిండియా మధ్య చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీమర్లకు ఫస్ట్ సెషన్ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో చెప్పాడు. అనుభవం ఉన్న ప్లేయర్లతో పాటు యువ ప్లేయర్లతో తమ టీం మిక్స్ అయి ఉందని.. ఇది మంచి పరిణామం అని తెలిపాడు. ముగ్గురు సీమర్లతో బరిలో దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ చెప్పడం గమనార్హం.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ)లో ముందుకెళ్లాలంటే టీమిండియాకు ఈ సిరీస్‌తో పాటు రాబోయే 8 మ్యాచ్‌లు అత్యంత కీలకం కానున్నాయి. దీంతో ఇండియా బ్యాటర్లు ఎక్కువగా స్పిన్ ఆడటంపై దృష్టి సారించారు. గత పదేండ్లలో స్వదేశంలో ఇండియా గెలుపోటముల రికార్డు 40–4గా ఉంది. దీన్ని కొనసాగించాలని చూస్తున్న ఇండియా.. బంగ్లాపై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కారు ప్రమాదం నుంచి కోలుకుని క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లోకి అడుగుపెడుతున్నాడు. 2022లో బంగ్లాతో సిరీస్ తర్వాత అతను కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే బంగ్లాతో టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ మధ్యలో చాలా జరిగినా టీమ్‌లో తన ప్లేస్‌ను మాత్రం కాపాడుకున్నాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన పంత్.. రెడ్ బాల్ క్రికెట్‌లో తన రీఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించిన ధ్రువ్ జురెల్ నుంచి పోటీ ఉన్నా.. గంభీర్ మాత్రం పంత్‌కే ఓటేశాడు. ‘పంత్ విధ్వంసకరమైన బ్యాటర్. టెస్ట్ క్రికెట్‌లో అతను ఏదైనా చేయగలడు. స్వేచ్ఛగా ఆడే చాన్స్ అతనికిచ్చాం. వరల్డ్‌లో ఎక్కడైనా రన్స్ చేసే సత్తా అతనికి ఉంది’ అని గౌతీ వ్యాఖ్యానించాడు.