- రవి, తిలక్, జితేశ్‌కు చాన్స్!
- మ్యాచ్‌కు వర్షం ముప్పు
- రా. 7 నుంచి స్పోర్ట్స్-18, జియో సినిమాలో లైవ్
హైదరాబాద్: స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అపజయం లేకుండా దూసుకుపోతున్న టీమిండియా.. మరో క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే మూడో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో ఇండియా కోరిక నెరవేరుతుందా? లేదా? చూడాలి. ఇప్పటికే 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. జట్టులోకి వచ్చిన కుర్రాళ్ల పెర్ఫామెన్స్‌పై మరోసారి ఫోకస్ చేయనుంది.
వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఈవెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నించే రెండో టీమ్‌ను రెడీ చేసేందుకు గంభీర్ బృందం కసరత్తులు చేస్తోంది. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన కొంత మందికి రెస్ట్ ఇచ్చి రిజర్వ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్‌కు చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక టెస్ట్, టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న బంగ్లాదేశ్ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరును కాపాడుకోవాలని భావిస్తోంది.
వరుణ్, రవి వస్తారా?
ఈ మ్యాచ్ కోసం ఇండియా తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ కనిపిస్తోంది. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దీంతో కొత్త కాంబినేషన్‌ను ప్రయత్నించే అవకాశాలున్నాయి. అదే జరిగితే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేష్ శర్మకు చాన్స్ దక్కొచ్చు. తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ మరో విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. రెండో మ్యాచ్‌తోనే అతను టీమ్‌లో దాదాపుగా ప్లేస్ సుస్థిరం చేసుకున్నాడు.
అదే టైమ్‌లో తిలక్ వర్మ కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన ప్రభావాన్ని చూపెట్టాల్సిన టైమ్ వచ్చింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌కు తోడుగా మయాంక్, హర్షిత్ రాణాలో ఒకర్ని తీసుకోవచ్చు. రెండో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ప్లేస్‌లో రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇస్తారేమో చూడాలి.
జాకీర్ అలీ ప్లేస్‌లో మెహిదీ హసన్
ఇండియా టూర్‌లో ఇంకా విజయం రుచి చూడని బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. ఇందుకోసం కెప్టెన్ శాంటో చాలా కాంబినేషన్స్‌ను ట్రై చేస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు జట్టులో ఉన్నా ఇండియా బౌలింగ్ ముందు తేలిపోవడం బంగ్లా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
కనీసం ఈ మ్యాచ్‌లోనైనా లిటన్ దాస్, హ్రిదోయ్, మహ్మదుల్లా, పర్వేజ్ బ్యాట్లు ఝుళిపించాలని బంగ్లా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జాకీర్ అలీ ప్లేస్‌లో మెహిదీ హసన్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. బౌలింగ్‌లో తస్కిన్, ముస్తాఫిజుర్‌పై ఎక్కువ అంచనాలున్నాయి.