- ఇరు జట్లకు భారీ భద్రత ఏర్పాటు
కాన్పూర్ : తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుంటోంది. చెన్నైలో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన జట్టు కాన్పూర్‌లో శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులోనూ ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఆందోళన కలిగిస్తోంది. అకాల వర్షాలు కాన్పూర్ టెస్టులో తొలి రెండు రోజులకు ఇబ్బంది కలిగించే చాన్సుంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం శనివారం వరకూ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ తొలి రోజైన శుక్రవారం వర్షం కురిసే చాన్స్ 92 శాతం, శనివారం 90 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో యూపీ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) ఔట్ ఫీల్డ్‌ను కప్పేందుకు డీడీసీఏ నుంచి అదనపు కవర్లు తెప్పించింది.
ఏటీఎస్ బృందాలతో భద్రత
ఈ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా మ్యాచ్ సందర్భంగా ఆందోళన చేస్తామని హిందూ మహాసభ హెచ్చరించింది. దాంతో, హోటల్ నుంచి గ్రౌండ్ వరకూ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో కూడిన మూడంచెల భద్రతను రెండు జట్లకు కల్పించినట్లు కాన్పూర్ పోలీసులు తెలిపారు.
ఆ స్టాండ్‌తో ప్రమాదం
వర్షం, భద్రతతోనే కాకుండా ఈ మ్యాచ్‌లో గ్రీన్ పార్క్ స్టేడియంలోని ఓ స్టాండ్ విషయంలోనూ నిర్వాహకులకు తలనొప్పి వచ్చిపడింది. స్టేడియంలోని బాల్కనీ–సి స్టాండ్ ప్రమాదకరంగా ఉందని యూపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) ఇంజనీర్ల బృందం తెలిపింది. ప్రేక్షకులు ఎక్కువగా వస్తే స్టాండ్ కూలిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. దీన్ని రిపేర్ చేయడానికి సమయం లేకపోవడంతో 4800 సీట్ల సామర్థ్యం ఉన్న స్టాండ్‌లో తొలుత 1700 టికెట్లు మాత్రమే అమ్మాలని భావించారు. తర్వాత ఆ స్టాండ్ మొత్తాన్ని మూసివేయాలని నిర్ణయించారు.
చెన్నైలానే కాన్పూర్ వికెట్..
చెన్నై చెపాక్ స్టేడియంలో ఎర్రమట్టితో తయారు చేసిన వికెట్‌పై మొదట బౌన్స్ లభించి తర్వాత ఫ్లాట్‌గా మారి బ్యాటర్లకు అనుకూలించింది. చివర్లో స్పిన్నర్లకు సపోర్ట్ ఇచ్చింది. అయితే, నల్ల మట్టితో కూడిన కాన్పూర్ వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించినా.. ఇది కూడా చెన్నై మాదిరిగానే స్పందిస్తుందని గ్రీన్ పార్క్ క్యూరేటర్ శివ్ కుమార్ చెబుతున్నాడు.
ఐదు రోజులు మన్నికగా ఉండే వికెట్ తొలి రెండు సెషన్లలో పేసర్లకు తర్వాతి మూడు రోజుల్లో స్పిన్నర్లకు సపోర్ట్ ఇస్తుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో లోకల్ స్టార్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకొని ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయం అనిపిస్తోంది.
ప్రాక్టీస్..ప్రాక్టీస్
రెండో మ్యాచ్ కోసం ఇండియా, బంగ్లాదేశ్ బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తొలి నెట్ సెషన్‌లో పాల్గొంది. మధ్యాహ్నం గ్రౌండ్‌లోకి వచ్చిన టీమ్ ముందుగా వామప్ డ్రిల్స్ చేసింది. తర్వాత ప్లేయర్లంతా నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ చేశారు. కోచ్ గంభీర్.. విరాట్‌కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్, జడేజాతో కలిసి పిచ్‌ను పరిశీలించాడు.
హెడ్ కోచ్ గంభీర్ కూడా వికెట్‌ను పరిశీలించి గ్రౌండ్ స్టాఫ్‌తో మాట్లాడాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ముమ్మర సాధన చేసింది. ప్లేయర్లంతా నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక, తొలి టెస్టులో చేతి వేలి గాయానికి గురైనప్పటికీ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ టీమ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని బంగ్లా హెడ్ కోచ్ తెలిపాడు.