- అండగా నిలిచిన జడేజా, యశస్వి
- హసన్ మహ్మద్‌కు 4 వికెట్లు
చెన్నై : బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇండియా తడబడి తేరుకుంది. రవిచంద్రన్ అశ్విన్ (112 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 బ్యాటింగ్) కెరీర్‌లో ఆరో సెంచరీతో చెలరేగగా, రవీంద్ర జడేజా (117 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 బ్యాటింగ్) బ్యాట్ అడ్డేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు చుక్కలు చూపెట్టారు.
ముఖ్యంగా మూడు టెస్ట్‌ల అనుభవం ఉన్న పేసర్ హసన్ మహ్మద్ (4/58) దెబ్బకు టీమిండియా స్టార్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 144 రన్స్‌కే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ దశలో అశ్విన్–జడేజా మంచి సమన్వయంతో ఆడి ఏడో వికెట్‌కు 195 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. యశస్వి జైస్వాల్ (118 బాల్స్‌లో 9 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
క్యూ కట్టారు..
టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ ఆనవాయితీకి వ్యతిరేకంగా బౌలింగ్ ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ ఆరో ఓవర్‌లోనే దాని ఫలితం కనబడింది. ఇండియా ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడినా, రెండో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ (6) ఘోరంగా విఫలమయ్యాడు. ఒక రన్ వద్ద డీఆర్‌ఎస్ నుంచి బయటపడినా వికెట్‌ను కాపాడుకోలేదు. ఆరో ఓవర్‌లో హసన్ మహ్మద్ వేసిన క్రాస్ సీమ్ బాల్‌ను టచ్ చేసి రెండో స్లిప్‌లో నజ్ముల్‌కు క్యాచ్ ఇవ్వడంతో 14 రన్స్ వద్ద తొలి వికెట్ పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (0) కూడా హసన్ మహ్మద్ 8వ ఓవర్‌లో వేసిన లెగ్‌సైడ్ బాల్‌ను ప్లిక్ చేయబోయి కీపర్ లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఫ్యాన్స్ కేరింతల మధ్య గ్రౌండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (6) కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. కానీ10వ ఓవర్‌లో హసన్ మహ్మద్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌ను టార్గెట్ చేసి వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌ను విరాట్ డ్రైవ్ చేయగా, బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ చేతిలోకి వెళ్లింది. తన మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసిన హసన్ మహ్మద్.. ఇండియా స్కోరును 34/3కి పరిమితం చేశాడు. ఈ దశలో రిషబ్ పంత్ (39), యశస్వి బ్యాట్లు అడ్డేయడంతో 88/3 స్కోరుతో ఇండియా లంచ్‌కు వెళ్లింది. కానీ బ్రేక్ తర్వాత హసన్ మహ్మద్ వేసిన మూడో ఓవర్‌లోనే రిషబ్ ఔటయ్యాడు. లెగ్‌సైడ్ బాల్‌ను టచ్ చేసి కీపర్‌కు చిక్కాడు.
దీంతో నాలుగో వికెట్‌కు 62 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ క్రమంలో జైస్వాల్ 95 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కొత్తగా వచ్చిన కేఎల్ రాహుల్ (16) కూడా బంగ్లా బౌలింగ్‌ను అడ్డుకోలేకపోయాడు. దీంతో టీ బ్రేక్‌కు కొద్ది ముందు ఇండియాకు డబుల్ స్ట్రోక్ తగిలింది. వరుస ఓవర్లలో నహీద్ రాణా (1/80), మెహిదీ హసన్ (1/77) దెబ్బకు జైస్వాల్, రాహుల్ వెనుదిరిగారు. ఈ ఇద్దరి మధ్య 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ కావడంతో ఇండియా 144/6తో ఎదురీత మొదలుపెట్టింది.
195 రన్స్ పార్ట్‌నర్‌షిప్
చెపాక్ పిచ్ గురించి అణువణువు తెలిసిన జడేజా, అశ్విన్ వీరోచితంగా పోరాడారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఔటైనా ఇన్నింగ్స్ పేకమేడలా కూలేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అశ్విన్ కచ్చితమైన ఫుట్‌వర్క్, పర్ఫెక్ట్ షాట్లతో బౌండ్రీల వైపు మొగ్గితే, జడ్డూ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. హసన్ మహ్మద్ షార్ట్ పిచ్‌లతో దాడి చేసినా అశ్విన్ ఏమాత్రం భయపడకుండా వంద స్ట్రయిక్ రేట్‌తో రన్స్ రాబట్టాడు. షకీబ్ వేసిన టర్నింగ్ బాల్‌ను మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్ సిక్సర్ కొట్టి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపెట్టాడు. అశ్విన్ కొద్దిగా విరామం తీసుకుంటే జడ్డూ వరుస బౌండ్రీలతో జోరు పెంచాడు.
ఈ క్రమంలో 73 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇక షకీబ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రవి అశ్విన్ సెంచరీ పూర్తి చేయడంతో చెపాక్ హోరెత్తింది. టెస్ట్‌ల్లో అతనికి వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. 2021 ఇంగ్లండ్‌పై మూడంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తం 174 నిమిషాల పాటు క్రీజులో నిలిచి 225 బాల్స్ ఎదుర్కొన్న అశ్విన్, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 195 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 80 ఓవర్లలో 339/6 (అశ్విన్ 102*, జడేజా 86*, హసన్ మహ్మద్ 4/58).