కొలంబో : ఆసియా కప్ సూపర్–4లో ఇండియా ఆఖరి మ్యాచ్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియాకు ఈ పోరు నామమాత్రమే అయినా.. రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యంగ్‌స్టర్స్‌కు చాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నది. ముఖ్యంగా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బౌలర్లపై ఒత్తిడి తగ్గించాలని ప్లాన్స్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే చాన్స్ ఉంది. ఇక టైటిల్ ఫైట్‌కు దూరమైన బంగ్లాదేశ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని చూస్తోంది.
శ్రేయసా.. రాహులా?
ఈ మ్యాచ్ కోసం ఇండియా భారీ మార్పులు చేయకపోయినా అవకాశాన్ని బట్టి రిజర్వ్ ప్లేయర్లకు చాన్స్ ఇవ్వొచ్చు. టాప్ ఆర్డర్‌లో రోహిత్, గిల్, కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండటంతో వాళ్ల ప్లేస్‌లకు ఢోకా లేదు. అయితే గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కు చాన్స్ ఇస్తారా? లేక రాహుల్‌ను కొనసాగిస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. గురువారం శ్రేయస్ నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గత మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేయడం అతనికి కలిసొచ్చే అంశం. ఒకవేళ టాప్–3లో ఎవరికైనా రెస్ట్ ఇస్తే మాత్రం రాహుల్, శ్రేయస్ ఫైనల్ ఎలెవన్‌లో ఉంటారు. ఇషాన్ కిషన్ ప్లేస్‌లో మార్పు లేకపోయినా సూర్యకుమార్ చాన్స్ కోసం చూస్తున్నాడు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజాతో పాటు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించనున్నారు. వర్క్‌లోడ్‌లో భాగంగా పేసర్లకు రెస్ట్ ఇవ్వనున్నారు. ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రా ప్లేస్‌లో షమీని తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో హార్దిక్ 18, సిరాజ్ 19 ఓవర్లు బౌలింగ్ వేయడంతో ఈ ఇద్దరికీ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా శార్దూల్‌ను దించొచ్చు. ఆరు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన కొలంబో పిచ్ ఇప్పుడు చాలా స్లోగా మారింది. దీంతో స్లో బౌలర్లపై ఇండియా ఎక్కువగా దృష్టి పెట్టనుంది.
గెలుపు లక్ష్యంగా బంగ్లా..
మరోవైపు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో సంచలనంపై దృష్టి పెట్టింది. సీనియర్ ముష్ఫికర్ రహీమ్ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతని ప్లేస్‌లో లిటన్ దాస్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. కెప్టెన్ షకీబ్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగింది. ఓపెనర్లు మిరాజ్, హసన్‌తో పాటు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ నయీమ్ భారీ స్కోర్లపై దృష్టి పెట్టారు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేస్తే భారీ టార్గెట్‌ను ఆశించొచ్చు. బౌలింగ్‌లో టస్కిన్, ఇస్లామ్, హసన్ మహ్మద్ అంచనాలు అందుకుంటే ఇండియాను కట్టడి చేయొచ్చు.
జట్ల (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ / రాహుల్, ఇషాన్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ / అక్షర్, కుల్దీప్, సిరాజ్, షమీ / బుమ్రా.బంగ్లాదేశ్: షకీబ్ (కెప్టెన్), మెహిదీ హసన్, తన్జీద్ హసన్ / నయీమ్, లిటన్ దాస్, హ్రిదోయ్, అఫిఫ్ హుస్సేన్, షమీమ్, నాసుమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్.