- స్పిన్నర్లను ఎదుర్కోవడంపై టీమిండియా ప్రత్యేక దృష్టి
- గెలుపే లక్ష్యంగా బంగ్లా టీమ్
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్-18,జియో సినిమాలో లైవ్
చెన్నై: ఒకప్పుడు ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అంటే స్పిన్నర్లదే హవా. టీమిండియా బ్యాటర్లు కూడా వాళ్లను దీటుగా ఎదుర్కొనేవారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా 2021 నుంచి ఇండియా టాపార్డర్.. స్పిన్నర్లను ఆడటంలో ఘోరంగా తడబడుతున్నది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ)లో ముందుకెళ్లాలంటే టీమిండియాకు ఈ సిరీస్‌తో పాటు రాబోయే 8 మ్యాచ్‌లు అత్యంత కీలకం కానున్నాయి. దీంతో ఇండియా బ్యాటర్లు ఎక్కువగా స్పిన్ ఆడటంపై దృష్టి సారించారు. గత పదేండ్లలో స్వదేశంలో ఇండియా గెలుపోటముల రికార్డు 40–4గా ఉంది. దీన్ని కొనసాగించాలని చూస్తున్న ఇండియా.. బంగ్లాపై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
‘టాప్’ లేపాలి..
టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యంత ప్రధానమైన బ్యాటర్. 2015 నుంచి స్వదేశంలో తలపడిన ప్రతి జట్టుపై నిలకడగా పరుగులు సాధించాడు. కానీ 2021 నుంచి స్పిన్‌ను ఆడటంలో తడబడుతున్నాడు. ఈ మధ్య కాలంలో అతను ఆడిన 15 టెస్ట్‌ల్లో సగటు 30గా ఉంది. కెప్టెన్ రోహిత్‌కు కూడా స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటాడనే పేరుంది. 2017లో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత స్పిన్నర్లపై అతని సగటు 90గా ఉండేది. కానీ 2021 నుంచి ఆడిన 15 మ్యాచ్‌ల్లో సగటు 44కి పడిపోయింది. రోహిత్‌తో సమానంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా సేమ్.
గత మూడేళ్లలో ఇండియాలో ఆడిన ఐదు టెస్ట్‌ల్లో అతని సగటు 23.40గా ఉంది. టీమిండియా లైనప్‌లో అత్యంత కీలకమైన ఈ ముగ్గురు గాడిలో పడకపోతే పరిస్థితి చేజారుతుంది. ఇక యంగ్‌స్టర్స్‌లో రిషబ్ పంత్ (5 మ్యాచ్‌ల్లో సగటు 70), శుభ్‌మన్ గిల్ (10 మ్యాచ్‌ల్లో 56), యశస్వి జైస్వాల్ (5 మ్యాచ్‌ల్లో 115) మెరుగ్గా ఆడుతున్నారు. ఈ త్రయం ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
ఎందుకంటే బంగ్లా టీమ్‌లో షకీబ్, తైజుల్ ఇస్లామ్, మెహిదీ హసన్ మిరాజ్‌లాంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నారు. తమదైన రోజున వీళ్లు ఎంతటి ప్రత్యర్థినైనా మట్టి కరిపిస్తారు. ఇండియా బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజా ప్లేస్‌లకు ఢోకా లేదు. పిచ్‌ను బట్టి థర్డ్ పేసర్‌గా ఆకాశ్‌దీప్, యష్ దయాల్‌లో ఒకరికి చాన్స్ ఇస్తారా? లేదంటే మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను ఆడిస్తారా చూడాలి. బంగ్లా పేస్ బౌలింగ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటే లోయర్ ఆర్డర్ బలోపేతం కోసం అక్షర్ పటేల్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
జోరుమీదున్న బంగ్లా..
పాకిస్తాన్‌పై 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ మంచి జోరుమీదున్నది. అదే జోష్‌లో టీమిండియాను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాక్‌తో రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే కొనసాగించనుంది. పేసర్లుగా హసన్ మహ్ముద్, తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా తుది జట్టులో ఉండనున్నారు. పాక్‌పై ఈ త్రయం 14 వికెట్లు తీసింది. అయితే చెన్నై పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని షకీబ్‌కు తోడుగా రెండో స్పిన్నర్ తైజుల్‌ను ఆడించొచ్చు. తొలి రెండు రోజులు పేస్, స్పిన్‌కు సమంగా అనుకూలించనున్న చెపాక్ పిచ్ ఆ తర్వాత స్పిన్నర్లకు స్వర్గంగా మారనుంది.
పంత్ 632 రోజుల తర్వాత..
కారు ప్రమాదం నుంచి కోలుకుని క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ 632 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లోకి అడుగుపెడుతున్నాడు. 2022లో బంగ్లాతో సిరీస్ తర్వాత అతను కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే బంగ్లాతో టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ మధ్యలో చాలా జరిగినా టీమ్‌లో తన ప్లేస్‌ను మాత్రం కాపాడుకున్నాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన పంత్.. రెడ్ బాల్ క్రికెట్‌లో తన రీఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించిన ధ్రువ్ జురెల్ నుంచి పోటీ ఉన్నా.. గంభీర్ మాత్రం పంత్‌కే ఓటేశాడు. ‘పంత్ విధ్వంసకరమైన బ్యాటర్. టెస్ట్ క్రికెట్‌లో అతను ఏదైనా చేయగలడు. స్వేచ్ఛగా ఆడే చాన్స్ అతనికిచ్చాం. వరల్డ్‌లో ఎక్కడైనా రన్స్ చేసే సత్తా అతనికి ఉంది’ అని గౌతీ వ్యాఖ్యానించాడు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్ (కీపర్), జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లామ్, జాకిర్ హసన్, మోమినుల్ ఇస్లామ్, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్ (కీపర్), షకీబ్, మెహిదీ హసన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, నహీద్ రాణా / తైజుల్ ఇస్లామ్.