వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో గెలిచి బోణీ కొట్టిన భారత జట్టు.. బంగ్లాపై గెలిచి సెమీస్ కు చేరువవ్వాలని భావిస్తుంది. మరోవైపు బంగ్లా సెమీస్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయ తప్పనిసరి. బలాబలాలను చూసుకుంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే భారత జట్టు విజయాన్ని వర్షం అడ్డుకునే ప్రమాదముంది.
భారత కాలమాన ప్రకారం మ్యాచ్ శనివారం (జూన్ 22) జరిగినా.. వెస్టిండీస్ లో ఈ మ్యాచ్ ఆదివారం (జూన్ 23) ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం ఉదయం మ్యాచ్ జరిగే సమయంలో చిరు జల్లులు పడే అవకాశముంది. ఇక్కడ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. వర్షం పడే అవకాశాలు 40 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆట మధ్యలో కూడా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఈ విషయం టీమిండియా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది.
ఇప్పటివరకు జరిగిన సూపర్ 8 మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ కూడా రద్దు కాలేదు. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే సూపర్ 8లో రద్దయిన తొలి మ్యాచ్ గా నిలుస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగడం వీలు కాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపై ఒక పాయింట్ కోల్పోతే అది టీమిండియాకే నష్టం. అప్పుడు ఆస్ట్రేలియాపై జూన్ 24 న జరగబోయే చివరి మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. మరి వరుణ దేవుడు కరుణిస్తాడో లేదో చూడాలి.