చెక్ దే ఇండియా : ఫైనల్లో భారత్.. చైనాతో టైటిల్ ఫైట్‌‌‌‌‌‌‌‌

చెక్ దే ఇండియా : ఫైనల్లో భారత్.. చైనాతో టైటిల్ ఫైట్‌‌‌‌‌‌‌‌

హులన్‌‌‌‌‌‌‌‌బుయిర్‌‌‌‌‌‌‌‌ (చైనా) : ఆసియా  చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా ఇండియా మరొక్క అడుగు దూరంలో నిలిచింది.  మెగా టోర్నీలో  తన అజేయ జైత్రయాత్రను కొనసాగించిన ఇండియా వరుసగా రెండోసారి, మొత్తంగా ఆరోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ నెగ్గిన జట్టు  నాకౌట్‌‌‌‌‌‌‌‌లోనూ అదే జోరు కొనసాగించింది.  సోమవారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా  4–-1తో  సౌత్ కొరియాను చిత్తుగా ఓడించింది. . సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ జట్టును ముందుండి నడిపించాడు.

హర్మన్‌ 19, 45వ నిమిషాల్లో రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌తో మరోసారి డబుల్ ధమాకా మోగించగా..   ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (13వ ని), జర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (32వ ని) తలో గోల్ కొట్టారు.  కొరియా జట్టులో యాంగ్‌‌‌‌‌‌‌‌ జిహున్‌‌‌‌‌‌‌‌ (33వ ని) ఏకైక గోల్ సాధించాడు.  మంగళవారం జరిగే ఫైనల్లో ఆతిథ్య చైనాతో  ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌లో చైనా షూటౌట్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరింది. నిర్ణీత 60 నిమిషాల్లో ఇరు జట్లు తలో గోల్‌‌‌‌‌‌‌‌తో 1–1తో సమంగా నిలిచాయి. అయితే, షూటౌట్‌‌‌‌‌‌‌‌లో చైనా 2–0తో పాక్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చింది. 

అదే జోరు.. అదే ఫలితం 

లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో  కొరియాను ఓడించిన ఇండియా నాకౌట్‌‌‌‌‌‌‌‌లో అదే ఫలితాన్ని రాబట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి హర్మన్‌‌‌‌‌‌‌‌సేన హవానే నడిచింది. ప్రత్యర్థి డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లోకి చొచ్చుకెళ్లిన ఇండియా ఆటగాళ్లు వరుసగా దాడులు చేశారు. నాలుగో నిమిషంలోనే అభిషేక్‌‌‌‌‌‌‌‌ కొట్టిన రివర్స్ హిట్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ను కొరియా గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్ కిమ్ జయెహన్ సేవ్ చేశాడు. అయితే, ఇండియా వరుస దాడులకు ఫస్ట్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫలితం లభించింది. రైట్ ఫ్లాంక్‌‌‌‌‌‌‌‌ నుంచి  అరైజిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అందించిన బాల్‌‌‌‌‌‌‌‌ను గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లోకి పంపిన ఉత్తమ్  ఇండియాకు తొలి గోల్‌‌‌‌‌‌‌‌ అందించాడు. మరోవైపు రెండో క్వార్టర్ మొదలైన వెంటనే కొరియాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఆ జట్టు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 

కొద్దిసేపటికే ఇండియాకు తొలి పెనాల్టీ లభించింది. దీనికి కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇండియా 2–0తో ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ముగించింది. ఎండ్స్ మారిన కూడా మనోళ్లు అదే జోరు కొనసాగించారు. మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో నిమిషంలో ఔట్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ నుంచి సుమిత్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన బాల్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న జర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లోకి పంపించాడు. కాసేపటికే పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌ను జిహున్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో కొరియా 1–3తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆ జట్టుకు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. 

మూడో క్వార్టర్ చివరి నిమిషంలో  కొరియా కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్లో కార్డు అందుకోవడంతో లభించిన పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌ను  హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌  గోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  ఇండియా ఆధిక్యం 4–1కి పెరిగింది. చివరి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొరియా గోల్ ప్రయత్నాలను ఇండియా సమర్థవంతంగా అడ్డుకుంది. ఎనిమిది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఇండియా సెకండ్ గోల్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్కెరా డబుల్ సేవ్‌‌‌‌‌‌‌‌తో  పార్క్ చెయెలోన్‌‌‌‌‌‌‌‌ గోల్ ప్రయత్నాన్ని నిలువరించాడు.