–జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకి రెట్టలు, విరిగిపోయిన పాత కుర్చీలను మార్చడంతో పాటు కొత్తగా పై కప్పులను నిర్మించారు. చూడగానే ఇది మన ఉప్పల్ స్టేడియమేనా అని ఆశ్చర్యపోయేలా కలర్‌ఫుల్‌గా మార్చేశారు.
ఇదిలావుంటే, మ్యాచ్ జరిగే 5 రోజులు 25వేల మందికి ఉచిత ప్రవేశంతో పాటు మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా కల్పిస్తున్నామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే మొదటి ప్రియారిటీ అన్న హెచ్‌సీఏ ప్రెసిడెంట్.. ఒక స్కూల్‌కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థలు, వారి కోసం ఎంతమంది స్టాఫ్ వస్తున్నారో ముందుగా తెలియజేస్తే వారికి టికెట్స్ అందజేస్తామన్నారు. అలా సమాచారం ఇవ్వకుండా నేరుగా స్టేడియానికి వస్తే ప్రవేశం ఉండదని పేర్కొన్నారు.
సాయుధ దళాల సిబ్బందికి ఉచిత ప్రవేశం
జనవరి 26న గణతంత్ర దినోత్సవ సంధర్బంగా భారత సాయుధ దళాల సిబ్బందికి హెచ్‌సీఏ శుభవార్త చెప్పింది. ఆరోజు తెలంగాణలో పని చేస్తున్న భారత సాయుధ బలగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సిబ్బంది వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాలి.