జనవరి 25 నుంచి ఇండియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి టెస్ట్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనుండగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐపీఎస్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
నిఘా నీడలో స్టేడియం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశమన్న సీపీ.. ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రేక్షకులకు అసౌకర్యం కలగకుండాఅవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు. టికెట్ల విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని, హెచ్‌సీఏ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
బడి పిల్లలకు ఉచితం
ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 6-12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పిస్తోంది..హెచ్‌సీఏ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్టేడియానికి వచ్చే పిల్లల కోసం మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది. అయితే, మ్యాచ్‌ను చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్‌లో స్టేడియానికి రావాల్సి ఉంటుంది. అంతకంటే ముందు దీని పట్ల ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు ఈ నెల 18లోగా హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail. com మెయిల్ ద్వారా గానీ స్టేడియంలో గానీ తెలియజేయాలి.
ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్ట్ (జనవరి 25- జనవరి 29): హైదరాబాద్
- రెండో టెస్ట్ (ఫిబ్రవరి 2 -ఫిబ్రవరి 6): విశాఖపట్నం
- మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19): రాజ్‌కోట్
- నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23- ఫిబ్రవరి 27): రాంచీ
- ఐదో టెస్ట్ (మార్చి 7- మార్చి 11): ధర్మశాల