హిట్‌‌మ్యాన్ ఈజ్ బ్యాక్‌‌..సెకండ్ వన్డేలో రోహిత్ విరోచిత సెంచరీ

హిట్‌‌మ్యాన్ ఈజ్ బ్యాక్‌‌..సెకండ్ వన్డేలో రోహిత్ విరోచిత  సెంచరీ

 

  • సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ
  • రెండో వన్డేలో 4 వికెట్లతో ఇండియా గెలుపు
  • 2–0తో సిరీస్ సొంతం
  •  రాణించిన గిల్‌‌, జడేజా

కటక్‌‌: కెప్టెన్ రోహిత్ శర్మ  (90 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119) ఖతర్నాక్ సెంచరీతో హిట్టు కొట్టగా..  వైస్ కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ (52 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 60) క్లాసిక్ ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌‌తో రెండో వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–0తో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లిష్ టీమ్ ఇచ్చిన 305 రన్స్ టార్గెట్‌‌ను ఆతిథ్య జట్టు 44.3  ఓవర్లలో 6  వికెట్లు కోల్పోయి ఛేజ్‌‌ చేసింది. శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41నాటౌట్‌‌) కూడా రాణించారు.  తొలుత  ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 స్కోరుకు ఆలౌటైంది. జో రూట్ (69), బెన్ డకెట్ (65), లివింగ్‌‌స్టోన్ (41) రాణించారు. ఆతిథ్య బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో వన్డే బుధవారం అహ్మదాబాద్‌‌లో జరుగుతుంది.

ఇటు కెప్టెన్‌‌.. అటు వైస్ కెప్టెన్‌‌ కెప్టెన్‌‌ రోహిత్ శర్మ చాన్నాళ్లకు ఫామ్‌‌లోకి రావడం... వైస్ కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్‌‌ తన జోరు కొనసాగించడంతో టార్గెట్‌‌ను ఇండియా ఈజీగా ఛేజ్‌‌ చేసింది. హిట్‌‌మ్యాన్ స్టార్టింగ్ నుంచే ధనాధన్ షాట్లతో అలరించడంతో టీ20 వేగంతో ఛేజింగ్ సాగింది. పవర్‌‌‌‌ ప్లేలో స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌ చేసిన రోహిత్‌‌ కట్‌‌, పుల్‌‌, పికప్‌‌, స్వీప్‌‌,  రివర్స్‌‌ స్వీప్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో 4,6తో టచ్‌‌లోకి వచ్చిన కెప్టెన్‌.. మహ్మూద్ బౌలింగ్‌‌లో రెండు సిక్సర్లతో అలరించాడు. ఏడో ఓవర్లో ఫ్లడ్‌ లైట్ ఫెయిల్యూర్‌‌ కారణంగా 35 నిమిషాల పాటు ఆట ఆగినా.. రోహిత్‌ జోరు తగ్గలేదు. మార్క్ వుడ్ వేసిన ఎనిమిదో ఓవర్లో మిడాన్‌‌ మీదుగా మరో భారీ సిక్స్‌‌ కొట్టాడు.  స్పిన్నర్ ఆదిల్ రషీద్‌‌కు రెండు ఫోర్లతో వెల్‌‌కం చెప్పిన రోహిత్ 30 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇంకో ఎండ్‌‌లో  గిల్ స్ట్రయిక్ రొటేట్‌‌ చేస్తూనే క్లాసిక్ షాట్లతో అలరించడంతో 14 ఓవర్లకే స్కోరు వంద దాటింది. 

వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గిల్‌‌ (45 బాల్స్‌‌) ఓవర్టన్‌‌ బౌలింగ్‌‌లో 4,4తో స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ఓవర్టన్‌‌ వేసిన యార్కర్‌‌‌‌కు క్లీన్ బౌల్డ్ అవ్వడంతో తొలి వికెట్‌‌కు 136 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. వచ్చీరాగానే అట్కిన్సన్ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ (5)... ఆదిల్ టర్నింగ్‌‌ బాల్‌‌కు కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్‌‌‌‌ తోడుగా రోహిత్‌‌ ముందుకెళ్లాడు.  మార్క్ వుడ్‌‌ బౌలింగ్‌‌లో లాంగాన్ మీదుగా సిక్స్‌‌తో 90ల్లోకి వచ్చిన అతను ఆదిల్‌‌ రషీద్ ఓవర్లో క్రీజు దాటొచ్చి మరో సిక్స్‌‌తో సెంచరీ (76 బాల్స్‌‌లో) పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రివర్స్ స్వీప్‌‌తో ఫోర్ రాబట్టిన హిట్‌‌మ్యాన్‌‌ను 30 ఓవర్లో లివింగ్‌‌స్టోన్‌‌ పెవిలియన్ చేర్చడంతో సూపర్ ఇన్నింగ్స్‌‌కు తెరపడింది. క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్‌‌‌‌.. అక్షర్‌‌తో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. అప్పటికే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది.   కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్యా (10) ఫెయిలైనా.. జడేజా (11 నాటౌట్‌‌)తో కలిసి అక్షర్ లాంఛనం పూర్తి చేశాడు.

తలో చేయి

టాపార్డర్‌‌‌‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు తలోచేయి వేయడంతో ఇంగ్లండ్ మంచి స్కోరు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న జట్టుకు ఓపెనర్లు ఫిల్‌‌ సాల్ట్‌‌ (26), బెన్ డకెట్ తొలి వికెట్‌‌కు 81 రన్స్ జోడించి మరోసారి మంచి ఆరంభం అందించారు. హర్షిత్ రాణాను టార్గెట్‌‌ చేస్తూ డకెట్‌‌ వరుస బౌండ్రీలతో ఆకట్టుకున్నాడు. మరోవైపు  సాల్ట్‌‌ నిలకడగా ఆడటంతో తొలి పది ఓవర్లలో ఇంగ్లిష్​ టీమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా 75/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన వెంటనే అరంగేట్రం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  ఇండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. 11వ ఓవర్లో జడేజా పట్టిన క్యాచ్‌‌తో సాల్ట్‌‌ను ఔట్‌‌ చేశాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన జో రూట్‌‌ కూడా సత్తా చాటడంతో 16 ఓవర్లలో స్కోరు వంద దాటింది. కానీ, అదే ఓవర్లో డకెట్‌‌ను జడేజా ఔట్‌‌ చేసినా.. రూట్‌‌కు జతకలిసిన హ్యారీ బ్రూక్ (31) మిడిల్‌‌ ఓవర్లలో స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. కానీ, హర్షిత్ బౌలింగ్‌‌లో గిల్‌‌ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌‌కు బ్రూక్‌‌ పెవిలియన్ చేరడంతో మూడో వికెట్‌‌కు 66 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. అయినా కెప్టెన్ జోస్ బట్లర్ (34) ఫామ్ కొనసాగించడంతో 35 ఓవర్లకు 200/3తో నిలిచిన ఇంగ్లండ్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. 38వ ఓవర్లో ఊరించే బాల్‌‌తో బట్లర్‌‌‌‌ను పెవిలియన్ చేర్చిన హార్దిక్ నాలుగో వికెట్‌‌కు 51  రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ను  బ్రేక్‌‌ చేశాడు. స్లాగ్ ఓవర్లలో జడేజా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్‌‌తో పాటు జెమీ ఓవర్టన్‌‌ (6)ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్‌‌ స్పీడుకు కళ్లెం వేశాడు. అట్కిన్సన్ (3)ను షమీ  వెనక్కు పంపగా.. చివర్లో లివింగ్‌‌స్టోన్‌‌కు తోడు ఆదిల్ రషీద్ (14) మెరుపులతో ఇంగ్లండ్ స్కోరు 300 మార్కు దాటింది.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌: 49.5 ఓవర్లలో 304 ఆలౌట్ 
(రూట్ 69, డకెట్ 65, జడేజా 3/35).
ఇండియా:   44.3 ఓవర్లలో 308 /6  
(రోహిత్ 119, గిల్ 60, ఓవర్టన్‌‌ 2/27)

2 రోహిత్‌‌కు ఇది రెండో ఫాస్టెస్‌‌ (76 బాల్స్‌) సెంచరీ. 2023లో అఫ్గానిస్తాన్‌‌పై 63 బాల్స్‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు.

32  వన్డేల్లో రోహిత్‌‌కు ఇది 32వ సెంచరీ.ఈ ఫార్మాట్‌‌ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లలో మూడో ప్లేస్‌‌లో ఉన్నాడు.  విరాట్ కోహ్లీ (50), సచిన్ టెండూల్కర్ (49) టాప్‌‌–2లో ఉన్నారు. 

2  ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా వరుణ్ చక్రవర్తి (33 ఏండ్ల 164 రోజులు) నిలిచాడు. ఫారూఖ్‌‌ ఇంజినీర్‌‌‌‌ (36 ఏండ్ల 138 రోజులు) ముందున్నాడు.