
- ఇండియాను గెలిపించిన హైదరాబాదీ తిలక్
- రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
చెన్నై: హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (55 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) మరోసారి తన తడాఖా చూపెట్టాడు. ఖతర్నాక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఉతికేశాడు. ఛేజింగ్‌లో తోటి బ్యాటర్లు నిరాశపరిచినా శనివారం చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో ఒంటిచేత్తో ఇండియాను గెలిపించాడు. ఈ ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రైడన్ కార్స్ (31), జెమీ స్మిత్ (22) కూడా రాణించారు. ఆతిథ్య బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తిలక్ మెరుపులతో ఇండియా 19.2 ఓవర్లలో 166/8 స్కోరు చేసి గెలిచింది. కార్స్ మూడు వికెట్లు తీశాడు. తిలక్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో టీ20 మంగళవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
ఆదుకున్న బట్లర్, బ్రైడన్
ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), డకెట్ (3) నిరాశ పరచగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ బట్లర్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో టచ్‌లోకి వచ్చిన అతను సుందర్, బిష్ణోయ్ ఓవర్లలోనూ సిక్సర్లు బాదాడు. బ్రూక్ (13) కూడా ఫెయిలైనా బట్లర్ జోరు చూపెట్టాడు. అయితే, బట్లర్‌తో పాటు లివింగ్‌స్టోన్ (13)ను ఔట్ చేసిన అక్షర్ ప్రత్యర్థికి డబుల్ షాక్ ఇచ్చాడు. జెమీ స్మిత్ (22) వేగంగా ఆడి స్కోరు వంద దాటించి అభిషేక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ టైమ్‌లో బ్రైడన్ కార్స్ వరుస షాట్లతో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కానీ, ఆర్చర్ (12 నాటౌట్) తో సమన్వయ లోపంతో 17వ ఓవర్లో అతను రనౌటయ్యాడు. చివరి వరకూ క్రీజులో నిలిచిన ఆర్చర్.. ఆదిల్ (10) సపోర్టుతో స్కోరు 160 దాటించాడు.
తిలక్ తడాఖా
ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో అలరించిన ఓపెనర్ అభిషేక్ శర్మ (12)ను మార్క్ వుడ్ ఎల్బీ చేశాడు. మరో ఓపెనర్ శాంసన్ (5) మూడో ఓవర్లో ఆర్చర్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ (12) వెంటవెంటనే మూడు బౌండ్రీలు కొట్టగా.. ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో తిలక్ వర్మ ఖతర్నాక్ షాట్లతో 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కార్స్ ఓవర్లోనూ లాంగ్ లెగ్ మీదుగా సిక్స్‌తో అలరించినా.. అదే ఓవర్లో సూర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) నిరాశపరచడంతో ఆతిథ్య జట్టు 78/5తో కష్టాల్లో పడింది. దాంతో తిలక్‌తో పాటు సుందర్ (26) జాగ్రత్త పడ్డాడు. మార్క్ వుడ్ వేసిన 13వ ఓవర్లో ఆదిల్ రషీద్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన సుందర్ చివరి మూడు బాల్స్‌కు 6, 4, 4 కొట్టి ఇండియాను రేసులోకి తెచ్చాడు. కానీ, క్రాస్ సీమ్ బాల్‌తో అతడిని బౌల్డ్ చేసిన కార్స్ ఆతిథ్య జట్టుకు మరో షాక్ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (2) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 30 బాల్స్‌లో 40 రన్స్ అవసరమైన దశలో ఆర్చర్ వేసిన 16వ ఓవర్లో మరోసారి రెచ్చిపోయిన తిలక్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా.. అర్ష్‌దీప్ (6) ఫోర్ రాబట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా 19 రన్స్ వచ్చాయి. కార్స్, లివింగ్ స్టోన్ ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన రవి బిష్ణోయ్ (9 నాటౌట్) సపోర్ట్ ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో 2, 4తో తిలక్ మ్యాచ్ ముగించాడు.