- టీ20 టీమ్ కొత్త వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్‌కతా : ఇండియా టీ20 టీమ్‌లో ఓపెనర్లకు మాత్రమే ఫిక్స్‌డ్ స్లాట్స్ ఉన్నాయని, మిగతా బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు తమ స్థానాలను మార్చుకోవాల్సి ఉంటుందని కొత్త వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు. తనతో పాటు ఎవ్వరైనా జట్టు అవసరాల మేరకు బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి జరిగే టీ20 సిరీస్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అక్షర్ మట్లాడాడు.
‘2024 ఆరంభం నుంచి జట్టులో ఓపెనర్లకు మాత్రమే ఫిక్స్‌డ్ ప్లేస్‌లు ఉండాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితులు, కాంబినేషన్లు, మ్యాచ్‌లకు తగ్గట్టుగా 3 నుంచి 7వ పొజిషన్ వరకూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ స్పష్టం చేశారు. ఈ సిరీస్ (ఇంగ్లండ్‌తో)లోనూ అదే పద్ధతిని కొనసాగిస్తాం. టీ20 క్రికెట్‌లో సరైన బ్యాటర్‌ను.. సరైన పరిస్థితిలో ఆడించడం చాలా ముఖ్యం’ అని అక్షర్ చెప్పుకొచ్చాడు.
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడాన్ని అక్షర్ స్వాగతించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీలో షమీ రాణించాడని చెప్పాడు. ఓ సీనియర్ ప్లేయర్ తిరిగివచ్చినప్పుడల్లా జట్టు ఉత్సాహం పెరుగుతుందన్నాడు. కొత్త బాల్‌తో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే షమీ ఉండటం తమ జట్టు బలాన్ని పెంచుతుందని పేర్కొన్నాడు.