ఇండియా విమెన్స్ సీనియర్ టీమ్ కొంత గ్యాప్ తర్వాత బిజీగా మారనుంది. ఆసియా గేమ్స్ అనంతరం మళ్లీ గ్రౌండ్‌లోకి దిగి ఇంగ్లండ్ విమెన్స్ టీమ్‌ను ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమ్ ఈ ఏడాది మంచి సక్సెస్ సాధించింది. ఆసియా గేమ్స్‌లో గోల్డ్ నెగ్గిన టీమ్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 2–1తో గెలిచింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో ట్రై సిరీస్‌లో ఫైనల్ చేరుకుంది.
మరోవైపు వరల్డ్ నం.2 ఇంగ్లండ్ ఈ మధ్యే తమ స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 1–2తో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ పరాజయం నుంచి కోలుకొని టీమిండియాపై సత్తా చాటాలని ఆశిస్తోంది. అయితే, సొంతగడ్డపై టీ20ల్లో, ఇంగ్లండ్‌పైనా ఇండియాకు మంచి రికార్డు లేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. చివరగా ఐదేండ్ల కిందట బ్రబౌర్న్ స్టేడియంలో 8 వికెట్ల తేడాతో గెలిచింది.
ఓవరాల్ రికార్డులోనూ ఇండియాపై ఇంగ్లండ్‌దే పైచేయి. ఇరు జట్ల మధ్య జరిగిన 27 మ్యాచ్‌ల్లో ఇండియా ఏడింటిలోనే గెలవగలిగింది. పైగా స్వదేశంలో ఇండియా టీ20 మ్యాచ్ గెలిచి రెండేండ్లు అవుతోంది. చివరగా 2021లో సౌతాఫ్రికాను ఓడించింది. అప్పటి నుంచి ఆడిన మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిన టీమిండియా ఒక మ్యాచ్‌ను టై చేసుకుంది. మొత్తంగా సొంతగడ్డపై ఆడిన 50 టీ20ల్లో 19 మాత్రమే గెలిచి 30 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై గెలిచి ఈ రికార్డును మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. చివరగా ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, ఇంగ్లండ్ తలపడ్డాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దాంతో, ఈ సిరీస్‌తోనే టీమిండియా వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ప్రారంభించనుంది.
జోరు మీద బ్యాటర్లు
షార్ట్ ఫార్మాట్‌లో ఈ ఏడాది ఇండియా బ్యాటర్లు మంచి పెర్ఫామెన్సే చేశారు. ఇప్పటిదాకా ఆడిన 13 టీ20ల్లో కెప్టెన్ హర్మన్ మూడు ఫిఫ్టీలు సహా 323 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 16 మ్యాచ్‌ల్లో 342 రన్స్ సాధించగా.. మంధాన 15 మ్యాచ్‌ల్లో మూడు ఫిఫ్టీలు సహా 369 రన్స్‌తో టాప్ బ్యాటర్‌గా ఉంది. పైగా, ది హండ్రెడ్ లీగ్‌లో అదరగొట్టిన మంధాన తన టీమ్ సదర్న్ బ్రేవ్స్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు హర్మన్ ఈ మధ్య ముగిసిన విమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో 14 మ్యాచ్‌ల్లో 321 రన్స్‌తో తన బ్యాట్ పవర్ చూపెట్టింది. బలమైన ఇంగ్లండ్‌ను ఓడించాలంటే ఇండియా బ్యాటర్లు మరింత జోరు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ ఈ ఏడాది16 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా కొనసాగుతోంది.
ఈ సిరీస్ కోసం విమెన్స్ టీమ్‌లోకి పలువురు కొత్త ప్లేయర్లు వచ్చారు. కర్నాటక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, పంజాబ్ స్పిన్నర్ మన్నత్ కశ్యప్, బెంగాల్‌కు చెందిన మరో లెఫ్టాండ్ స్పిన్నర్ సైకా ఇషాక్‌ను తీసుకున్నారు. మన్నత్ ఈ ఏడాది ఇండియా అండర్19 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. గత విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇషాక్ 15 వికెట్లతో సత్తా చాటింది. శ్రేయాంక విమెన్స్ కరీబియన్ ప్రీమియర్‌కు లీగ్‌కు ఎంపికైన తొలి ఇండియన్‌గా నిలిచింది. సీనియర్లకు తోడు ఈ యంగ్ స్టర్స్ కూడా మెప్పిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టమేం కాబోదు.
బలంగా ఇంగ్లండ్
హీథర్ నైట్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ టీమ్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. వెటరన్ సివర్ డబ్ల్యూపీఎల్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. ప్రస్తుత ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో తను అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్ అనొచ్చు. డబ్ల్యూపీఎల్‌లో 332 రన్స్ చేసి, పది వికెట్లు పడగొట్టిన ఆమె ఈ ఏడాది ఆడిన ఎనిమిది టీ20ల్లోనే 271 రన్స్ చేసి ఫుల్ ఫామ్‌లో ఉంది. డాని వ్యాట్ (11 మ్యాచ్‌ల్లో 278 రన్స్) కూడా మంచి టచ్‌లో ఉండగా, సోఫీ ఎకిల్‌స్టోన్ (16 వికెట్ల), సారా గ్లెన్ (13 వికెట్లు) టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున బెస్ట్ బౌలర్లుగా నిలిచారు.
ఈ సిరీస్‌కు ముందు ఇండియా–ఎతో జరిగిన మూడు టీ20ల్లో ఇసీ వాంగ్ ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చేసింది. దాంతో ఇంగ్లండ్–ఎ 2–1తో సిరీస్ నెగ్గింది. స్పిన్‌కు అనుకూలించే, స్లో వికెట్లపై జరిగిన ఆ మ్యాచ్‌ల్లో ఇరు జట్ల బ్యాటర్లు తడబడ్డారు. ఇండియా, ఇంగ్లండ్ సీనియర్ టీమ్స్‌లోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో స్పిన్నర్ల జోరు నడిచే చాన్సుంది.