భారత యువ క్రికెటర్ల రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఒకరికొకరు పోటీపడి ఆడుతూ అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఓ వైపు దిగ్గజ క్రికెటర్ల జ్ఞాపకాల(రికార్డులు)ను శుభ్‌మాన్ గిల్ చెరిపేస్తుంటే.. అతని రికార్డును యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాదిన ఈ యువ క్రికెటర్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే శతకం బాదిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
జైస్వాల్ మెరుపులు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే.. తాను మాత్రం భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ నేపాల్ బౌలర్లను అల్లాడించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న జైస్వాల్.. 48 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ALSO READ: Asian Games 2023: జైస్వాల్ విధ్వంసం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
రైనా పగ చల్లారినట్లే..!
గతేడాది వరకూ అతి చిన్న వయసులో సెంచరీ చేసిన భారత క్రికెటర్ ఘనత మాజీ క్రికెటర్ సురేష్ రైనా పేరిట ఉండేది. 23 ఏళ్ల 156 రోజుల వయసులో రైనా సెంచరీ చేశాడు. అయితే, ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ దానిని అధిగమించాడు. 23 ఏళ్ల 146 రోజుల వయసులో సెంచరీ చేసి.. రైనా రికార్డు కనుమరుగయ్యేలా చేశాడు. ఇప్పుడు గిల్ రికార్డును.. అధిగమించాడు. ప్రస్తుతం జైస్వాల్ వయసు.. 21 ఏళ్ల 9 నెలల 13 రోజులే కావడం గమనార్హం. అలాగే ఆసియా క్రీడల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
అతి చిన్న వయసులో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు
- యశస్వి జైస్వాల్: 21 ఏళ్ల 9 నెలల 13 రోజులు
- శుభ్‌మన్ గిల్: 23 ఏళ్ల 146 రోజులు
- సురేష్ రైనా: 23 ఏళ్ల 156 రోజులు
- కేఎల్ రాహుల్: 24 ఏళ్ల 131 రోజులు
- దీపక్ హుడా: 27 ఏళ్ల 69 రోజులు
Shubman Gill broke Suresh Raina's record in 2023. Yashasvi Jaiswal breaks Shubman Gill's record in 2023 ?https://t.co/ORlT4ma6OG #INDvNEP #AsianGames pic.twitter.com/H4uRb1PRsf
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2023