IND vs NZ 2024: మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. తడిసి ముద్దయిన బెంగుళూరు

IND vs NZ 2024: మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. తడిసి ముద్దయిన బెంగుళూరు

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ అని సంబరపడేలోపు టీమిండియా ఫ్యాన్స్ కు వర్షం రూపంలో నిరాశ తప్పేలా కనిపించడం లేదు. మంగళవారం(అక్టోబర్ 16) బెంగుళూరు లోని చిన్నస్వామి వేదికగా జరగబోయే తొలి టెస్టుకు వర్షం సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరం రిపోర్ట్స్ ప్రకారం నేడు (మంగళవారం) 90 శాతం వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వర్షంతో గ్రౌండ్ తడిసింది. పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. బుధవారం (మ్యాచ్ మొదటి రోజు) నుంచి వర్షం తగ్గుముఖం పట్టినా మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగడం అసాధ్యంగా కనిపిస్తుంది. 

ఈ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయితే టీమిండియాకు నష్టం జరగనుంది. ఎందుకంటే స్వదేశంలో భారత జట్టును కివీస్ ఓడించడం అంత సాధ్యమైన విషయం కాదు. న్యూజిలాండ్ జట్టు కూడా ఏమంత ఫామ్ లో కనిపించడం లేదు. ఇటీవలే శ్రీలంకపై జరిగిన సిరీస్ లో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోయింది. మరోవైపు టీమిండియా బంగ్లాదేశ్ పై 2-0 తేడాతో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సగటు భారత అభిమాని మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది. అదే జరిగితే వరుసగా మూడో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరిన జట్టుగా నిలుస్తుంది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకున్నట్టే.