- రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 171/9
- ప్రస్తుత ఆధిక్యం 143 రన్స్
- తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 263 ఆలౌట్
- రాణించిన గిల్, పంత్
ముంబై : న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో ఇండియా పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. స్పిన్ వికెట్‌పై మంచి టర్నింగ్ రాబట్టిన జడేజా (4/52), అశ్విన్ (3/63) కివీస్ బ్యాటర్లను ఓ ఆటాడుకుంటూ మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పారు. విల్ యంగ్ (51) మినహా మిగతా వారు ఫెయిల్ కావడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 171/9 స్కోరు చేసింది. ఎజాజ్ పటేల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 59.4 ఓవర్లలో 263 రన్స్‌కు ఆలౌటైంది.
దాంతో 28 రన్స్ ఆధిక్యం లభించింది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) చెలరేగారు. ప్రస్తుతానికి ఆటలో ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. చేతిలో ఒకే వికెట్ ఉండగా 143 రన్స్ లీడ్‌లో కొనసాగుతున్న కివీస్ మరో 20, 30 రన్స్ చేసినా ఆ టార్గెట్‌ను ఛేజ్ చేయడం కష్టమే. మూడో రోజు ప్రత్యర్థి స్పిన్నర్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇండియాను గెలిపించే బాధ్యత ఇప్పుడు బ్యాటర్ల చేతుల్లో ఉంది.
పంత్, గిల్ జోరు
శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అద్భుత పోరాటంతో ఇండియా రేసులోకి వచ్చింది. ఉదయం గిల్ నెమ్మదిగా ఆడినా, పంత్ లాంగాన్, లాంగాఫ్‌లో రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో పంత్ 36, గిల్ 66 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అయితే ఇక ఇన్నింగ్స్ కుదురుకుందని భావించిన దశలో ఇష్ సోధీ (1/36) అనూహ్యంగా దెబ్బకొట్టాడు. తన లెగ్ బ్రేక్ బాల్‌ను ఆడే క్రమంలో పంత్ ఎల్బీ అవడంతో ఐదో వికెట్‌కు 96 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక పంత్ ఔటైన తర్వాత ఇండియా ఇన్నింగ్స్ 22 ఓవర్లలోనే ముగిసింది.
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన ఎజాజ్ పటేల్ (5/103).. వరుస విరామాల్లో జడేజా (14), సర్ఫరాజ్ ఖాన్ (0)ను ఔట్ చేశాడు. అదే క్రమంలో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న గిల్‌ను కూడా ఓ ఫ్లైటెడ్ డెలివరీతో పెవిలియన్‌కు పంపాడు. వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్) పోరాటం చేసినా రెండో ఎండ్‌లో అశ్విన్ (6), ఆకాశ్ దీప్ (0) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. హెన్రీ, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు.
మళ్లీ స్పిన్నర్లే..
రెండో సెషన్‌లోనే రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన న్యూజిలాండ్‌ను జడేజా, అశ్విన్ కుదురుకోనీయలేదు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే ఆకాశ్ దీప్ (1/10).. లాథమ్ (1)ను ఔట్ చేశాడు. 13వ ఓవర్లో సుందర్ (1/30).. డేవన్ కాన్వే (22)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 39/2తో కష్టాల్లో పడిన కివీస్‌ను గట్టెక్కించిన బాధ్యత తీసుకున్న విల్ యంగ్ నిలకడగా ఆడాడు. కానీ రెండో ఎండ్‌లో అతనికి సహకారం అందలేదు. అశ్విన్, జడేజా మంచి టర్నింగ్ బాల్స్‌తో మిగతా లైనప్‌ను పేకమేడలా కూల్చారు. 14వ ఓవర్లో అశ్విన్ దెబ్బకు రచిన్ రవీంద్ర (4) ఔట్‌తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది.
ఆ వెంటనే జడేజా తన వరుస ఓవర్లలో డారిల్ మిచెల్ (21), టామ్ బ్లండెల్ (4)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో యంగ్, మిచెల్ మధ్య నాలుగో వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. తర్వాత యంగ్‌తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (26) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరో వికెట్‌కు 31 రన్స్ జత చేసిన ఫిలిప్స్ 33వ ఓవర్‌లో అశ్విన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. చివర్లో జడ్డూ.. ఇష్ సోధీ (8), మ్యాట్ హెన్రీ (10)ని ఔట్ చేయగా, మధ్యలో యంగ్‌ను అశ్విన్ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేయడంతో రెండో రోజు ఆతిథ్య జట్టుదే పూర్తి పైచేయి అయింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 235 ఆలౌట్.
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 59.4 ఓవర్లలో 263 ఆలౌట్ (గిల్ 90, పంత్ 60, ఎజాజ్ పటేల్ 5/103).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 43.3 ఓవర్లలో 171/9 (విల్ యంగ్ 51, ఫిలిప్స్ 26, జడేజా 4/52, అశ్విన్ 3/63).