- పడగొట్టి.. తడబడ్డరు..న్యూజిలాండ్ 235 ఆలౌట్.. ఇండియా 86/4
- జడేజాకు 5, సుందర్‌కు 4 వికెట్లు
ముంబై: ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ రసవత్తరంగా మొదలైంది. ఆరంభంలో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్ (4/81) మ్యాజిక్ చూపెడితే.. చివర్లో కివీస్ 8 బాల్స్ తేడాలో మూడు వికెట్లు తీసి ఇండియాను ఆందోళనలో పడేసింది. దీంతో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 86/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. శుభ్‌మన్ గిల్ (31 బ్యాటింగ్), రిషబ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు డారిల్ మిచెల్ (82), విల్ యంగ్ (71) రాణించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 65.4 ఓవర్లలో 235 రన్స్‌కు ఆలౌటైంది. ప్రస్తుతం ఇండియా ఇంకా 149 రన్స్ వెనకబడి ఉంది.
ఇద్దరూ.. ఇద్దరే
స్పిన్ వికెట్‌పై టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను జడేజా, సుందర్ దెబ్బకొట్టారు. నాలుగో ఓవర్లో డేవన్ కాన్వే (4)ను ఔట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ (1/22) ఇచ్చిన ఆరంభాన్ని వీరిద్దరు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ముందుగా వరుస విరామాల్లో టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్ర (5)ను సుందర్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 72/3 స్కోరుతో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను మిచెల్, యంగ్ ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఈ ఇద్దరు నిలకడగా ఆడుతూ 92/3తో లంచ్‌కు వెళ్లారు. అయితే రెండో సెషన్‌లో వేడి ఎక్కువగా ఉండటంతో బాగా ఇబ్బందిపడిన కివీస్ బ్యాటర్లు జడేజా టర్నింగ్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఫెయిలయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని 45వ ఓవర్లో జడేజా డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఐదు బాల్స్ తేడాలో యంగ్‌తో పాటు టామ్ బ్లండెల్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు 87 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కొద్దిసేపటికే గ్లెన్ ఫిలిప్స్ (17)ను ఔట్ చేసిన జడ్డూ 61వ ఓవర్లో రెండోసారి ఝలక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో ఇష్ సోధీ (7), మ్యాట్ హెన్రీ (0) వికెట్లను పడగొట్టాడు. 66వ ఓవర్‌లో సుందర్ కూడా నాలుగు బాల్స్ తేడాలో మిచెల్, ఎజాజ్ పటేల్ (7)ను ఔట్ చేశాడు. ఓ దశలో 159/3 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన కివీస్ 76 రన్స్ తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.
8 బంతుల్లో 3 వికెట్లు..
కివీస్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేసిన ఆనందం ఇండియాకు ఎక్కువసేపు నిలవలేదు. ఏడో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ (18)ను హెన్రీ (1/15) ఔట్ చేయగా, జైస్వాల్ (30), గిల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 53 రన్స్ జోడించడంతో జట్టు కోలుకుంది. కానీ చివర్లో ఇండియా అనూహ్యంగా తడబడింది. కివీస్ స్పిన్నర్ ఎజాజ్ (2/33) 18వ ఓవర్లో వరుస బాల్స్‌లో జైస్వాల్, సిరాజ్ (0)ను ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. వికెట్ కాపాడుకోవాల్సిన దశలో కోహ్లీ (4) తర్వాతి ఓవర్లోనే అనవసర సింగిల్ కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. 8 బాల్స్ తేడాలో ఈ మూడు వికెట్లు పడటంతో ఇండియా నిరాశగా తొలి రోజును ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో 235 ఆలౌట్ (డారిల్ మిచెల్ 82, విల్ యంగ్ 71, రవీంద్ర జడేజా 5/65, సుందర్ 4/81). ఇండియా తొలి ఇన్నింగ్స్: 19 ఓవర్లలో 86/4 (గిల్ 31 బ్యాటింగ్, జైస్వాల్ 30, ఎజాజ్ 2/33).
- 5 టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఇండియన్‌గా జడేజా (314) నిలిచాడు. కుంబ్లే (619), అశ్విన్ (533), కపిల్ (434), హర్భజన్ (417) ముందున్నారు.
- టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం జడేజాకు ఇది 14వ సారి.