- నేడు న్యూజిలాండ్‌తో ఇండియా మ్యాచ్
- ఐదో విజయంపై ఇరు జట్ల గురి
- మధ్యాహ్నం 2 నుంచి స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్‌లో
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్‌లో మరో ‘సండే బ్లాక్‌బస్టర్’ అభిమానులను అలరించనుంది. ఆదివారం ఇక్కడి అందమైన ధర్మశాల స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో బలమైన జట్లు ఇండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఇరు జట్లూ ఫుల్ జోష్‌లో ఉన్నాయి. తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని కివీస్.. 12 ఏండ్ల తర్వాత మరో కప్పు గెలవాలన్న కసితో ఇండియా దూసుకెళ్తున్నాయి. దాంతో, ఈ మ్యాచ్ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇందులో గెలిచిన జట్టు ఐదో విక్టరీతో సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ముఖాముఖీ రికార్డులను చూస్తే వరల్డ్ కప్‌లో టీమిండియాపై న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. గత ఎడిషన్‌లో సెమీస్‌లో ఇండియా బ్లాక్‌క్యాప్స్ టీమ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఓవరాల్‌గా వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలడగా.. ఇండియా మూడింటిలో నెగ్గగా, కివీస్ ఐదుసార్లు గెలిచింది. ఓ మ్యాచ్ రద్దయింది. మొత్తంగా వరల్డ్‌కప్స్‌లో తమకు కొరకరాని కొయ్యగా ఉన్న కివీస్‌కు ఈసారి రోహిత్‌సేన చెక్ పెడుతుందేమో చూడాలి.
పాండ్యా లేకుండా
వరుసగా నాలుగు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలిచిన దూసుకెళ్తున్న టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కానీ, గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పోరుకు దూరం అవ్వడంతో కాస్త డీలా పరిచింది. అతని స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ లేకపోవడం జట్టుకు లోటు కానుంది. పాండ్యా లేకపోవడంతో టీమిండియా తమ విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీమర్ మహ్మద్ షమీ తుది జట్టులోకి రానున్నాడు.
ఇక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం కావడం అతనికి ప్లస్ పాయింట్ కానుంది. పాండ్యా గైర్హాజరీలో బ్యాటింగ్‌ను బలోపేతం చేయడానికి సూర్యకుమార్ అవసరం కనిపిస్తోంది. అయితే అతని కోసం ఓ ఆటగాడిని తప్పించాల్సి ఉంటుంది. ఈ వికెట్‌పై పేస్ , స్వింగ్ వస్తుంది కాబట్టి షమీ బాగా సరిపోతాడు. దాంతో, శార్దూల్ ను పక్కనబెట్టే చాన్సుంది. ఇక టాపార్డర్‌లో రోహిత్, గిల్, కోహ్లీ.. మిడిలార్డర్లో రాహుల్, శ్రేయస్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్‌లో ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. బంగ్లాదేశ్‌పై ఫిఫ్టీ చేసి టచ్‌లోకి వచ్చిన గిల్ మరో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నాడు.
బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా కొత్త బాల్‌తో టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కీలక వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు. మహ్మద్ సిరాజ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. షమీ వస్తే పేస్ బలం మరింత పెరగనుంది.
పేసర్లతో ముప్పు
న్యూజిలాండ్ కూడా ప్లేయర్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బొటనవేలు విరిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే కివీస్ బరిలోకి దిగుతోంది. గాయం తీవ్రత దృష్ట్యా కేన్ సెమీఫైనల్ వరకు తిరిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విలియమ్సన్ గైర్హాజరీలో డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ బ్యాటింగ్ బాధ్యతలు పంచుకోవడంతో కివీస్ సాఫీగా ముందుకొస్తోంది. ఓపెనింగ్‌లో విల్ యంగ్ కూడా సత్తా చాటుతున్నాడు.
సీనియర్ పేసర్ టిమ్ సౌథీ లేకపోయినా న్యూజిలాండ్ బౌలింగ్ పదుగానే ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రిస్తూ కివీస్ ప్రధాన ఆయుధంగా మారాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టిన అతను టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మాట్ హెన్రీ, లోఫెర్గూసన్, మరో సీనియర్ ట్రెంట్ బౌల్ట్ తమదైన రోజున ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌ను అయినా కూల్చివేయగలరు. బౌల్ట్ తన బెస్ట్ ఫామ్‌లో లేకపోయినా ఇండియాపై ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు ధర్మశాల వికెట్, వాతావరణం కివీస్ పరిస్థితులకు ముఖ్యంగా పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. వికెట్‌పై మంచి పచ్చిక కనిపిస్తోంది. ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉండనుంది. చల్లటి వాతావరణంలో కివీస్ పేసర్ల విషయంలో రోహిత్‌సేన జాగ్రత్తగా ఉండాలి.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ (కీపర్), జడేజా, సూర్యకుమార్ /ఇషాన్ కిషన్, షమీ/శార్దూల్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, విల్ యంగ్,రాచిన్, లాథమ్ (కెప్టెన్, కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, శాంట్నర్, మాట్ హెన్రీ, ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.