
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పని పట్టేశాం.. పొరుగు జట్టు బంగ్లాదేశ్‌ను కొట్టేశాం.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డూ తొలగించాం. ఇప్పుడు మిగిలింది న్యూజిలాండ్ జట్టే. లీగ్ దశలోనే ఓసారి కివీస్ రెక్కలు విరిచేసిన టీమిండియా మరోసారి బ్లాక్‌క్యాప్స్ టీమ్ మైండ్‌బ్లాంక్ చేసేస్తే టార్గెట్ పూర్తవుతుంది..! చాంపియన్స్ ట్రోఫీ పుష్కర కాల విరామం తర్వాత మళ్లీ మన సొంతం అవుతుంది. మెగా టోర్నీలో నేడే ఫైనల్..! న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో ఇండియానే ఫేవరెట్!
బలమైన క్రికెట్ జట్లలో ముందుండే న్యూజిలాండ్ వైట్ బాల్ ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలిచింది. 2000లో ఇదే చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో ఆ టీమ్ ఇండియానే ఓడించడం గమనార్హం. మరో ఐసీసీ టైటిల్ కోసం 25 ఏండ్లుగా నిరీక్షిస్తున్న న్యూజిలాండ్‌కు ఇప్పుడు మన జట్టే అడ్డుగా ఉంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఓడినా సెమీస్‌లో బలమైన సౌతాఫ్రికాకు చెక్ పెట్టిన శాంట్నర్ సేన తుదిపోరుకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకుంది. స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కొనే కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర బ్లాక్‌క్యాప్స్ టీమ్స్ బ్యాటింగ్‌కు అత్యంత కీలకం కానున్నారు.
Also Read:-ఫైనల్ మ్యాచ్..రూ. 5వేల కోట్ల బెట్టింగ్!.
సెమీస్‌లో సెంచరీలు చేసి ఈ ఇద్దరూ జోరు మీద ఉన్నారు. ఆరో ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతున్న కేన్ వన్డేల్లో ఇంకెంత కాలం కొనసాగుతాడో ఈ మ్యాచ్ ఫలితం తేల్చనుంది. అయితే, ఇండియాను ఓడించాలంటే మిగతా బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంటుంది. కివీస్ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. కెప్టెన్ శాంట్నర్, బ్రేస్‌వెల్‌కు తోడుగా రచిన్, ఫిలిఫ్స్ తమ స్పిన్ బాల్స్‌తో బ్యాటర్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. కానీ, భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ప్రధాన పేసర్ మ్యాట్ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. తను ఫిట్‌గా లేకుంటే డఫీ, నేథన్ స్మిత్‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు.
పిచ్/వాతావరణం
గ్రూప్ దశలో ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన వికెట్‌ను ఫైనల్‌కు ఉపయోగించనున్నారు. ఇది స్లో వికెట్. స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. టాస్ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్‌కు మొగ్గు చూపొచ్చు. 270–280 రన్స్ మంచి స్కోరు అవుతుంది. దుబాయ్‌లో వేడి పెరిగింది. ఆదివారం వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ (కీపర్), హార్దిక్, అక్షర్ ,జడేజా, కుల్దీప్, షమీ, చక్రవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్,
విలియమ్న్, లాథమ్ (కీపర్), డారిల్ మిచెల్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), జెమీసన్, ఒరూర్క్, హెన్రీ/నేథన్ స్మిత్.